Sunday 3 December 2017

పరమాచార్యుల స్మృతులు : నిమ్మకాయ



పరమాచార్యుల స్మృతులు : నిమ్మకాయ
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)

శ్రీవారు తేనంబాకంలో విడిది చేస్తున్నప్పటి సంగతి. నేనూ అక్కడే వారి సేవలో ఉండేవాణ్ణి. మా అన్నయ్య నాతో మా నాన్నగారి ఆబ్దీకం ఏ రోజు వచ్చిందో చెప్పాడు. ఆబ్దీకం ముందురోజు నేను శ్రీవారివద్దకు వెళ్ళి సెలవు కోరాను.

"నువ్వెందుకు వెళ్ళాలి ? మీ అన్నయ్య ఆబ్దీకం నిర్వహిస్తాడు. నీకు నేనున్నానుగా!" . శ్రీవారు అప్పుడప్పుడూ చిన్నపిల్లాడిలా మాట్లాడుతారు.

"నేను ఆ రోజే, రాత్రికల్లా, తిరిగి వచ్చేస్తాను".

శ్రీవారు ఒక నిమ్మకాయ తెమ్మని, దాన్ని చేతిలో పట్టుకుని అప్పుడప్పుడూ వాసనచూస్తున్నారు.

తరువాతరోజు ఉదయమే నేను ప్రయాణానికి సిద్ధమై, శ్రీవారికి సాష్టాంగం చేశాను. శ్రీవారి నాకు నిమ్మకాయ ఇచ్చారు. నేను బయలుదేరాను. ఐదున్నరకల్లా బయలుదేరవలసిన బస్సు ఎక్కి కూర్చున్నాను. నిముషాలుగడుస్తున్నాయి కానీ బస్సు కదిలే సూచనలేమీ కనిపించట్లేదు. వయసుపైబడిన మా అమ్మ, అన్నయ్య నాకోసం ఇంట్లో వేచిఉన్నారు, నేనేమో బస్సు కదలటం కోసం. కంగారు పెరిగిపోతోంది. ఇంక ఆగలేక, కండక్టరుని ఆలస్యానికి కారణమేంటని అడిగేశాను.

"నాకు  ఓ నిమ్మకాయ కావాలి. ఏ రోజైనా బస్సులో నిమ్మకాయ పెట్టిన తరవాతే, బస్సు కదుపుతాము. ఓ అబ్బాయిని నిమ్మకాయ కోసం దుకాణదారుడి వద్దకి పంపాను,  ఆయనవల్ల ఈ రోజు ఆలస్యం"

"ఇదుగో నిమ్మకాయ, ఇంక బయలుదేరుదాం", అన్నాను.

"శ్రీవారు ఇచ్చారా ఇది ?  స్వామియే ఇచ్చుంటారు", డ్రైవరు చాలా గౌరవంతో ఆ నిమ్మకాయ తీసుకుని, బస్సు నడపటానికి సిద్ధమయ్యాడు.

ఈ నిమ్మకాయతో శ్రీవారు నిన్నటినుంచీ ఏం పరిహాసం చేశారు !

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.