ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
జగద్గురువుల స్తోత్రాలు, సంభాషణలు, ఇతర భక్తి, ధార్మిక విషయాలు
Thursday, 13 June 2019
ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది
ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
Saturday, 16 December 2017
గోదా అమ్మవారి ప్రార్థన
గోదా అమ్మవారి ప్రార్థన
నీలాతుంగస్తనగిరితటీసుప్తం ఉద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
నీలాదేవి యొక్క ఉన్నత స్తనగిరులపై నిద్రించు కృష్ణుని, ఉపనిషత్తుల సారమైన పరతంత్రత పాఠం చెప్పుటకు నిద్రలేపినట్టిదీ, తాను ధరించి వదలిన పూలచెండులతో కృష్ణుని బలవంతముగ బంధించి సంతోషించునట్టిదీ అగు ఆ గోదాదేవి కి మళ్ళీ మళ్ళీ నా నమస్కారములు.
అన్నవయల్ పుదువై ఆణ్డాళరఙ్గఱ్క
ప్పన్ను తిరుప్పావై ప్పల్ పదియమ్ - ఇన్నిశైయాల్
పాడి క్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై
శూడికొడుత్తాళై చ్చొల్.
హంసలు తిరుగుతున్న పంటపొలములతో నిండిన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన ఆండాళు శ్రీరంగనాథునకు తాను మనసులో భావించి తిరుప్పావు అను పేరు గల ఈ పాశురములను మధురమగు గానముతో పాడి సమర్పించినది. ఇది వాఙ్గ్మాలిక. అట్లే పూమాలికను తాను ధరించి అర్పించినది. ఓ మనసా! ఆ ఆండాళును స్మరించుము.
శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్ పావై
పాడి యరుళవల్ల పల్ వళైయాయ్! - "నాడినీ
వేంగడ వఱ్కెన్నై విది" యెన్ఱ విమ్మాతమ్
నాంగడవా వణ్ణమే నల్‍గు.
పూమాలను దాల్చి రంగనాథునికి సమర్పించిన ఓ బంగారుతీగా! పూర్వము జరిగిన ఆ దివ్యవ్రతమును పాటలుగా పాడి మమ్ములనుద్ధరింపజాలిన ఓ దివ్య కంకణధారిణీ! "వేంకటాచలపతికి నన్ను ప్రియురాలుగా సమకూర్చుము" అని నీవు చేసిన ప్రార్థనను నీ దాసులమగు మేము కూడ అతిక్రమింపజాలనట్లు అనుగ్రహించుము.
(తమిళ అనువాదము శ్రీ భాష్యం అప్పలాచార్యుల గ్రంథంనుండి)
Thursday, 14 December 2017
పరమాచార్యుల స్మృతులు : ఇంక దండంతో పని లేదు
పరమాచార్యుల స్మృతులు : ఇంక దండంతో పని లేదు
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)
దీపావళి ఇంకా రెండు రోజులుందనగా - శ్రీవారు అప్పటికి ఇంకా అజగరస్థితి మొదలు పెట్టలేదు (దీని గురించి ఈ వ్యాసంలో తరువాత చెప్పబడుతుంది) - శ్రీవారు భిక్ష స్వీకరించలేదు. వారు తమ తుది ప్రస్థానం గురించి చాలా సంకేతాలిచ్చేవారు, మాకే ఏమీ అర్థం కాలేదు.
ధర్మ పాటీ అక్కడకు వచ్చింది.
"ఏమిటి ఈ రోజు విశేషం? ఏం చేస్తున్నావు ?"
"భాగవతం చదువుతున్నాను"
"భాగవతంలో భగవానుడేంచేస్తున్నాడు ?"
"బాలలీల! ఆడుకుంటున్నాడు"
"నీకు తెలుసా ? నేను కూడా ఒక లీల చూపబోతున్నాను", అన్నారు శ్రీవారు. మేము పట్టించుకోలేదు. అది మెదలు, మొదటి ప్రశ్న.
శ్రీవారు భిక్ష స్వీకరించలేదు. బాగా జ్వరంగా ఉంది. శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలు (గురక) వినిపిస్తున్నాయి. బాగా చిక్కిపోయారు. పడుకునే ఉన్నారు. అలాంటి సమయాలలో కన్నన్ మామ మంచి సహాయకుడు. ఏనుగంత బలం ఉందతనికి. అతని తెలివి మాకు లేదు.
"ఏమిటిది ? శ్రీవారు భిక్ష తీసుకోకపోతే మనం ఒప్పుకోవాలా ? శ్రీవారిని కూర్చోబెట్టండి. తడిగుడ్డతో తుడవండి. విభూతి తీసుకువచ్చి శ్రీవారికి అద్దండి. "
ఆ చెప్పిందంతా చేశాము. శ్రీవారిని తడిగుడ్డతో తుడిచి, విభూతి నుదిటికి అద్దాము.
"ఒక గిన్నెలో అన్నం కలిపి తీసుకురమ్మని శ్రీకంఠన్ తో చెప్పండి. వెంగుడి డాక్టర్ని పిలవండి. శ్రీవారు చాలా బలహీనంగా ఉన్నారు. నాడి చూపాలి."
అలాంటి సమయాల్లో శ్రీవారి వద్దకు వెళ్ళటానికి శ్రీకంఠన్ భయపడతాడు. నాకే శ్రీవారివద్ద చనువు. నేను అన్నం తీసుకొచ్చాను. వైద్యుడు వచ్చారు. శ్రీవారు వైద్యుని ఎదురుగా భిక్ష స్వీకరించారు. అదే మొదలు. శ్రీవారు మరొకరు - ఆ వైద్యుడు - చూస్తూండగా భిక్షచేయటం.
కాసేపటి తరువాత, తిరుకడవూర్ రామమూర్తి, అరకోణం బాలు, నేను శ్రీవారి సన్నిధిలో ఉన్నాము.
"నీ సంగతేంటి ? ఏంచేస్తావు ?"
"నాకేం తెలుసు ? శ్రీవారు ఉన్నప్పుడు నాకు భయం దేనికి ?", అని నవ్వాను. వారి ప్రశ్న ప్రాముఖ్యాన్ని మాత్రం అర్థం చేసుకోలేదు.
"నీ సంగతేంటి ?" రామమూర్తివేపు చూస్తూ అన్నారు శ్రీవారు.
"విత్తు వేసినవాడే చెట్టుకి నీరు పోస్తాడు", అంటూ వేదాంతం వల్లించాడు రామమూర్తి.
"చెట్ల గురించి ఏమి మాట్లాడుతున్నాడు ?" అని నన్నడిగారు శ్రీవారు. నేను రామమూర్తి అన్న మాటలు మళ్ళీ చెప్పాను.
శ్రీవారి దండం అక్కడ ఉంది. శ్రీవారికీ దండానికీ మధ్య వెళ్ళరాదు. మేము ఆ మధ్యలోకి వెళ్ళకుండా శ్రీవారి వద్దకు వెళ్ళలేక పోయాము.
" దండం ఇక్కడ ఉంది" అన్నాడు అరకోణం బాలు.
" ఇంక దండంతో పని లేదు" అన్నారు శ్రీవారు.
ఆరోజు తరువాత శ్రీవారు దండాన్ని ముట్టుకోలేదు. అది, తమ ఉపసంహారం గురించి మాకు నర్మగర్భంగా చెప్పడం.
"నేనొక కొండచిలువ లాగా కొంతకాలం పడుకోవాలనుకుంటున్నాను. నోరు తెరచి వెల్లకిలా కదలకుండా పడుకుని ఉంటూ నోట్లో ఏం పడితే అదే ఆహారంగా తీసుకోవాలి" అని శ్రీవారు కుంభకోణం రాజమణిశాస్త్రితో చాలాకాలం క్రితం చెప్పారు.
చెప్పినట్లే శ్రీవారు అలా మూడేళ్ళు చేశారు.
మూడో యేట, మళ్ళీ దీపావళి సమయం.
మాకు దీపావళినాట యమునికి దీపం వెలిగించి, ’యమాయ, ధర్మాయ’ అంటూ నామాలు చదవటం ఆనవాయితీ. పెద్ద ఇనప దీపపు సమ్మెలో ధాన్యం పోసి, అందులో మరో మట్టి దీపపు ప్రమిద పెట్టి దానిలో బోలెడు నెయ్యి పోసి , పెద్ద వత్తిని యముడిని ఆవాహనచేస్తూ వెలిగిస్తాము. తెలుగువాళ్ళు ఆనాడు యమతర్పణాలు ఇస్తారు. మేము చెయ్యము. ఆంత నెయ్యి వలన దీపం ఐదారు రోజులు వెలుగుతుంది.
ఆ సంవత్సరం దీపం బోలెడు చప్పుడు చేసి, ఒక గంటలోపల మట్టి ప్రమిద ముక్కలైపోయింది. అదో దుశ్శకునమని మాకు తెలుసు.
మార్గశిరమాసంలో శ్రీవారు వెళ్ళిపోయారు.
Friday, 8 December 2017
పరమాచార్యుల స్మృతులు : వీ ఐ పీ
పరమాచార్యుల స్మృతులు : వీ ఐ పీ
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)
ఒకరోజు అయిదేళ్ళ చిన్నపిల్ల వాళ్ళ అమ్మానాన్నలతో దర్శనానికి వచ్చింది. చేతిలో చిన్న పుస్తకం పట్టుకుని తిన్నగా వెళ్ళి శ్రీవారి ఒళ్ళో కూర్చుంది. అమ్మానాన్నలు ఆ పిల్లని వెనక్కి రమ్మని ఎంతో బ్రతిమాలారు. అమ్మాయి వినలేదు. శ్రీవారు లేశమాత్రమయినా విసుగు చెందలేదు, కోప్పడలేదు.
"ఇది ఆటోగ్రాఫ్ పుస్తకం", అంది ఆ అమ్మాయి, "ఇందులో నీ పేరు వ్రాయి!" అంటూ మళ్ళీ మళ్ళీ అడిగింది.
"చేతిలో పెన్ను పట్టుకుని చాలాకాలం అయ్యింది, నేను వ్రాయడం బొత్తిగా మర్చిపోయాను. నేను పేరు వ్రాయను" అన్నారు శ్రీవారు.
అమ్మాయి మొంకిపట్టు పట్టింది. శ్రీవారు మఠం కార్యనిర్వహణాధికారిని పిలిపించి, వారితో ఆ పుస్తకం మీద మఠం ముద్ర వేయమనీ, "నారాయణస్మృతి" అని చేతితో వ్రాయమనీ ఆదేశించారు. శ్రీవారి శ్రీముఖాలపై అలా ఉంటుంది.
ఆ అమ్మాయి దాంతో సంతృప్తి చెంది, తలిదండ్రులతో బయల్దేరింది.
వాళ్ళు మఠం దాటకముందే శ్రీవారు ఆ అమ్మాయిని వెనక్కి పిలిపించారు. కార్యనిర్వహణాధికారితో ఇలా అన్నారు.
"కార్యాలయంలో వీ ఐ పీలూ, మంత్రులూ, కలెక్టర్లూ ఇక్కడకు వచ్చినప్పుడు వారు సందేశం వ్రాసే పెద్దపుస్తకం ఉంది. ఈ పిల్లను కార్యాలయానికి తీసుకువెళ్ళి ఆ పుస్తకంలో తన పేరు వ్రాయించు. ఈ అమ్మాయి కూడా వీ ఐ పీ నే. చిన్నపిల్లలు దైవాంశసంభూతులు".
ఆ పిల్లను కార్యాలయానికి తీసుకువెళ్ళి సందర్శకుల పుస్తకంలో తన పేరు వ్రాయించారు.
Wednesday, 6 December 2017
పరమాచార్యుల స్మృతులు : శరణాగతవత్సలులు
పరమాచార్యుల స్మృతులు : శరణాగతవత్సలులు
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)
కాశీయాత్ర పూర్తిచేసి మఠానికి తిరిగి వచ్చిన శ్రీవారిని కుప్పు సహాయంకోసమై అర్థించాడు.
"నా వద్ద ఏముంది ? ధనమూ లేదు, మరేమీ లేదు. నేనేంచెయ్యగలను ?"
కుప్పు ప్రార్థన ఆపలేదు. శ్రీవారు తప్ప మరి దిక్కులేరన్నాడు. కుప్పు మంచి ప్రతిభాశాలి. చాలా భాషలునేర్చినవాడు. డిగ్రీ పట్టా ఉందతనికి. ఒక్క రాత్రిలో శుద్ధ సంస్కృతంలో మహామాఘం ప్రాధాన్యతగురించి పద్యకావ్యం వ్రాశాడు. తమిళ, ఆంగ్లభాషలూ బాగా వచ్చు. చివరికి శ్రీవారి సిఫారసుమీద ఒక బ్యాంకులో ఉద్యోగం దొరికిందతనికి. ఒక సంవత్సరం గడిచిందేమో.
శ్రీవారు తంజావూరులో విడిదిచేస్తుండగా ఒకనాడు ఒక వ్యక్తి, పూజకోసం వేయించిన మంటపానికి దాదాపు బయట, కూర్చుని కనిపించాడు. చొక్కా వేసుకుని ఉన్నాడు, ధూమపానం చేస్తూండగా కూడా ఎవరో చూశారు. శ్రీవారు ఆవ్యక్తిని తీసుకురమ్మన్నారు. ఆ మనిషి వచ్చేవాడిలాగా అనిపించలేదు, కానీ శ్రీవారి మాట జవదాటకూడదుగా. శ్రీవారి సహాయకులలో ఒకరు అతనిదగ్గరకువెళ్ళి శ్రీవారిని కలువవలసినదిగా కోరారు. అతడు వెంటనే వచ్చాడు.
"సరి అయిన దుస్తులు ధరించకపోవటం చేత రాలేదు", అన్నడతను సంజాయిషీ చెప్పుకుంటూ. శ్రీవారు అతనితో కాసేపు మాటలాడి, కుప్పు గురించి అడిగారు. అతడు జవాబివ్వటానికి సందేహించాడు. కొంతసేపు అడిగిన తరువాత కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. "అదేంటంటే.... కుప్పు సెలవులో ఉన్నాడు". చివరికి, తడవ తడవలుగా, మాకు ఈ వ్యక్తిద్వారా తెలిసిందేమిటంటే - కుప్పుకి బ్యాంకులో కాషియర్‍గా పని ఇచ్చారనీ, డబ్బు దొంగతనం చేయడం వల్ల తాత్కాలికంగా తొలగించారనీను.
ఆ రోజు పూజ ముగిసిన తరువాత శ్రీవారు కుప్పువాళ్ళ గ్రామానికి వెడుతున్నానని ప్రకటించారు.
"అదోచిన్న కుగ్రామం, మనందరినీ వాళ్ళు భరించలేకపోవచ్చు. పైగా ఇప్పటికిప్పుడు పీఠాన్ని తరలించలేము" అంటూ అసమ్మతి తెలిపారు మఠ కార్యనిర్వహణాధికారి.
"పూజను తీసుకుని బయలుదేరుతున్నాను" అని ఆ గ్రామానికి బయలుదేరారు శ్రీవారు.
అవసరానికి అందరూ ఏకమవడం తంజావూరువాసుల ప్రత్యేకత. రాత్రికిరాత్రి వాళ్ళు సరంజామా కూర్చుకుని, మంటపాన్ని ఏర్పాటుచేశారు. పూజకూ ఇతర అవసరాలకూ సామగ్రి సిద్ధంచేశారు. ఆ కుగ్రామాన్ని తిరునాళ్ళలాగా మార్చేశారు.
శ్రీవారి సంగతంటారా, వారు తిన్నగా కుప్పువాళ్ళ ఎదురింటికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కుప్పు వాళ్ళింట్లోనే అటకెక్కి దుప్పటి ముసుగుతన్ని పడుకున్నాడు. రెండురోజుల తరువాత మూడోరోజు మధ్యాహ్నం, కుప్పు ఏంజరుగుతోందో చూడటానికి జాగ్రత్తగా బయటకు వచ్చాడు. శ్రీవారు కుప్పును పసిగట్టి, తీసుకురమ్మన్నారు. కొంతమంది వీధి దాటి అవతలప్రక్కకు వెళ్ళి ఒకటో రెండో దెబ్బలువేసి కుప్పుని శ్రీవారివద్దకు తీసుకొచ్చారు. కుప్పు వెంటనే సాష్టాంగం చేస్తూ శ్రీవారి పాదాలమీద పడ్డాడు. పాదాలు పట్టేసుకున్నాడు.
శ్రీవారివలె శరణాగతిచేసినవారిని క్షమించి రక్షించేవారెవరూ లేరు. తమ పాదాలవద్ద ఆశ్రయంకోరినవారిని రక్షించు ప్రతిజ్ఞలో శ్రీవారు సాక్షాత్తూ శ్రీరాముడే. శరణాగతవత్సలులు.
కుప్పు సుమారు అయిదువేలరూపాయలు కాజేశారనుకుంటా. ఆ రోజుల్లో మఠంలో భిక్షావందనమునకు పదమూడురూపాయలు ఇవ్వవలసి ఉండేది. అయిదువేలరూపాయలు ఎంతపెద్దసొమ్మో మీరు ఊహించుకోవచ్చు. ఇది నలభైల్లో సంగతి. శ్రీవారు కుప్పుని తిట్టలేదు, ఒక్కమాట అడగలేదు. మఠ కార్యనిర్వహణాధికారిని పిలిపించి బ్యాంకుకు ఆ డబ్బును కట్టివెయ్యమన్నారు.
శ్రీవారు తరువాత తిరుచిరాపల్లిలో నేషనల్‍కాలేజీ స్థలంలో విడిది చేశారు. ఆరోజుల్లో ప్రతీ ఏటా చివరి ’రెండో శనివారం’ నాడు ఉపాధ్యాయుల పరిషత్తు సమావేశం జరిగేది. అవి తెల్లదొరతనం రోజులు. శ్రీవారు కళాశాల అధ్యక్షుడితో మాట్లాడారు. " ఈ కుర్రాడికి డిగ్రీ పట్టా ఉంది, చాలా భాషలు వచ్చు. మీరు మీ పాఠశాలలో ఉద్యోగం ఇవ్వగలరా ?".
"శ్రీవారి ఆదేశం. శ్రీవారు కోరుకుంటే పది ఉద్యోగాలు ఇవ్వగలను".
అలా కుప్పు జీవితంలో మళ్ళీ స్థిరపడ్డాడు. అప్పుడప్పుడూ దర్శనంకోసం వచ్చేవాడు. ఒక్కసారికూడా శ్రీవారు కుప్పుతో ఆ సంఘటన గురించి మాట్లాడలేదు. శ్రీవారు తమ భాషలోకానీ, ఇతరులతో తమ ప్రవర్తనలో కానీ ఎంతో ఉన్నతులు.
జీవితపు చివరిరోజుల్లో కుప్పుకు తన మలమూత్రవిసర్జనపై అదుపు ఉండేదికాదు. అలాంటి పరిస్థితిలో చనిపోయినవారికి మరుజన్మలేదంటారు. కుప్పు శ్రీవారినుండి ఒక్క చీవాటూ ఎరుగడు.
Monday, 4 December 2017
పరమాచార్యుల స్మృతులు : కరుణ, వాత్సల్యం
పరమాచార్యుల స్మృతులు : కరుణ, వాత్సల్యం
(బాలూమామ స్వానుభవాలు : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)
శ్రీవారు గుంటూరులో విడిదిచేస్తున్నప్పటిమాట. ఒక రైతు బుట్టనిండా తన పొలంలో పండిన మిరపకాయలు తీసుకొచ్చి శ్రీవారికి సమర్పించాడు.
"ఈ భిక్షని మీరు స్వీకరించాలి" అన్నాడు.
ఆ రోజు భోజనంలో శ్రీవారికి మిరపకాయే. ఆయన అనేక వంటకాలు వివరంగా చెప్పి చేయించారు. మిరప్పచ్చడి, మిరపకాయ-పెసలతో పప్పు, మిరపకాయ కూర, మిరపకాయ పెరుగు పచ్చడి, మిరపకాయ-చింతపండు పచ్చడి, మిరపకాయ ముక్కల వేపుడు, దోరగా వేయించిన మిరపకాయలు, ఉడకబెట్టిన మిరపకాయలు. నన్ను నమ్మండి, మిరపకాయతో ముప్ఫైరకాలు.
ప్రతీ ఒక వంటకాన్నీ, ఏమీ మిగల్చకుండా అన్నింటినీ ప్రశాంతంగా తిన్నారు శ్రీవారు. తిన్నందుకు ఏ తేడా చెయ్యలేదు.
--
మేము ఒకసారి తేనంబాకం నుండి వీధిలో నడచి వస్తూ ఒక ముస్లిం నడిపే టీ కొట్టు దాటాము. శ్రీవారిని చూడగానే కొట్టు యజమాని కంగారుగా బయటకు పరిగెత్తుకువచ్చాడు. చేతిలో ఉన్న వేడిపాల గాజుగ్లాసు శ్రీవారివేపు జాపాడు.
"స్వామి ఇవి త్రాగాలి" అన్నాడు.
శ్రీవారు నన్ను ఆ గ్లాసు తీసుకోమన్నారు. తీసుకున్నాను కానీ, ’ఎంతోమంది ఆ గ్లాసులో త్రాగి ఉంటారు, అలాంటి గ్లాసులో ఇచ్చిన పాలని ఏంచెయ్యాలో’ అనుకున్నాను. ఆ గ్లాసుని హాలులో ఒక మూల పెట్టాను. సాయంత్రం అయ్యింది. శ్రీవారు వరండాలో కూర్చుని ఉన్నారు.
"ఆ గ్లాసుడు పాలు తీసుకురా. అదే ఈ రోజు నాకు భిక్ష. పాలల్లోనో , పెరుగులోనో నానబెట్టిన అటుకులు కాదు. కావాలంటే అవి మీరు తినండి. నాకొద్దు.
నేను పెట్టినచోటునుండి ఆ గ్లాసు తీసుకొచ్చి శ్రీవారికి ఇచ్చాను.
"చూడు, చాలా ఆప్యాయంగా ఇచ్చాడు, త్రాగాల్సిందే" అని, తాగేశారు.
---
Sunday, 3 December 2017
పరమాచార్యుల స్మృతులు : ఏడురోజులు మిగిలింది
పరమాచార్యుల స్మృతులు : ఏడురోజులు మిగిలింది
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)
శ్రీవారు అప్పుడప్పుడూ అస్వస్థతకు లోనవుతూండేవారు. కానీ ఒక్కరోజుకూడా ఆ కారణంగా చంద్రమౌళీశ్వరపూజ మానలేదు. ఎన్నడూ పూజను త్వరగాముగించలేదు, ఏభాగమూ అలక్ష్యం చేయనూలేదు.
1945లో శ్రీవారికి గుండెపోటు వచ్చింది. నార్తార్కాటుకు చెందిన డాక్టరు, మైలాపూర్ టీ ఎన్ కృష్ణస్వామి శ్రీవారిని పరిశీలించి ఇలా అన్నారు - "శ్రీవారి నాడి బలహీనంగా ఉంది, గుండె పరిస్థితి బాగోలేదు. నేను చెయ్యగలిగినదంతా చేస్తాను, కానీ హామీ ఇవ్వలేను ."
శ్రీవారు ఆయుర్వేదానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. వారు, మేలగరం ఘనపాఠిగారికి కబురుపెట్టారు. ఘనపాఠిగారు బహుశాస్త్రకోవిదులు. వేదములు, ఆయుర్వేదం, జ్యోతిషం మొదలైన వాటిలో అపారమైన పాండిత్యం ఉంది. వారు శ్రీవారి మణికట్టు పట్టుకుని నాడి పరిశీలించారు.
ఇలాంటి వ్యక్తులకు వంశపారంపర్యంగా నాడీ పరిశీలనం వస్తుంది. చేతి లావు, బిగువు చూసి మనిషి పరిస్థితి చెప్పేస్తారు. ఇలా చెప్పటాన్ని ’దాదు’ అంటారు. స్త్రీ గర్భం ధరించిన నెలలోపలే, వైద్యులు గర్భం నిర్థారించకముందే, ఎడమచెయ్యి పట్టుకుని, ఖచ్చితంగా ’మీకు అబ్బాయ’నో, ’మనుమరాల’నో చెప్పేస్తారు. అలాగే జరిగితీరుతుంది. నాడి లెక్కబెట్టి ఈ మనిషి ఇన్ని రోజులు, వారాలు, సంవత్సరాలు బతుకుతాడని చెప్పేస్తారు. ఆరోగ్య పరిస్థితి అవగాహనకోసం మగవారికి కుడిచెయ్యి, ఆడువారికి ఎడమచెయ్యి పట్టుకుంటారు.
ఘనపాఠిగారు శ్రీవారి నాడి పరిశీలించి - "ఏడురోజులు మిగిలింది" అన్నారు. తరువాత శ్రీవారి జాతకం తెప్పించుకుని, దానిని పరిశీలించారు, లెక్కకట్టారు - "జాతకం ఈ రోజుకు ఎనిమిదిరోజులంటోంది" అన్నారు.
ఇంకా ఇలా అన్నారు - " నేను శ్రీవారికి వైద్యం చెయ్యటానికి సిద్ధం. నేను చెప్పినవి తుచ తప్పకుండా చెయ్యాలి. వారి సమక్షంలో నాలుగు వేదాల పారాయణ జరగాలి. రాత్రులు రాక్షసులకూ, పగళ్ళు దేవతలకూ చెందుతాయి. అందుకని వేదపారాయణ రాత్రింబగళ్ళు జరగాలి. ఒక ఆవుకి కేవలం నేరేడు ఆకులు మాత్రమే ఆహారంగా పెట్టాలి. నేరేడు ఆకులు, నీళ్ళు - అంతే. వేరే పశుగ్రాసం ఇవ్వరాదు. శ్రీవారు ఆ ఆవు పాలని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి".
శ్రీవారు కంగారుపడ్డారు. "నా ఆరోగ్యం బాగవడానికి ఒక ఆవుని బాధించి కేవలం నేరేడుఆకులే ఆహారంగా పెట్టాలా ? ఆవుకి అది సరిపోతుందా ? ఆవుకి జరకూడనిదేమైనా జరిగితే ? ఆ పాతకం మనపైకి ఎందుకు తెచ్చుకోవటం ?"
"నాకు ఆవు ప్రాణాలని మంత్రాల ద్వారా రక్షించగల శక్తి ఉంది" అన్నారు ఘనపాఠిగారు. "శ్రీవారు ఆ విషయమై ఆలోచించనక్కరలేదు. ఆ ఆవుని సజీవంగా ఉంచటం నా బాధ్యత".
వైద్యం కొన్ని రోజులు నడిచింది. ఎన్ని రోజులో నాకు సరిగ్గా గుర్తులేదు. శ్రీవారు ఎప్పటిలానే చంద్రమౌళీశ్వరపూజ చేసేవారు, ఆ పాలు తప్ప వేరేవేమీ తీసుకోలేదు. వేదపారాయణం జరిగేది. ఘనపాఠిగారు ఫలానా రోజున ఫలానా సమయం గడవాలని చెప్పారు. ఆ సమయం తరువాత ఆహారనియమం సడలింది. ఆరోజు చాలా అసాధారణమైనది. సరిగ్గా ఘనపాఠిగారు చెప్పినరోజున ఆ సమయానికి , వారు ముందే చెప్పినట్టు ఒక పెద్ద పిశాచం భూమ్యాకాశాల మధ్యలో కనిపించింది. కనీసం పదిమంది - పాఠశాల వెంకట్రామన్, సిమిచి వంచిఅయ్యర్, కుల్ల శీను, ఇంకా కొంతమంది - దాన్ని చూశారు. సేతురామన్ అప్పటికి చిన్నవాడు, వాడూ చూశాడు. ఇది సత్యం, నేనిప్పుడు చెబుతున్నట్టే జరిగింది. ఘనపాఠివంటి వారు గొప్ప తపస్సంపన్నులు. ఎంతోమంది తపోనిష్టులు శ్రీవారివద్దకు వచ్చేవారు. శ్రీవారు ఎప్పుడూ పండితులమధ్యలో ఉండేవారు. ఇప్పుడు అంతా ఖాళీగా ఉంటున్నాం. ఘనపాఠిగారి అబ్బాయి జెమినీ ఇప్పుడు ఉన్నారు.
"ఇంక భయపడాల్సిందేమీ లేదు. పిశాచం పారిపోయింది. శ్రీవారు నూరేళ్ళు జీవిస్తారు" అన్నారు ఘనపాఠిగారు.
భగవంతుడి కరుణవల్ల ఆ ఆవు ఏ ఇబ్బందీ లేకుండా ఉంది. నేరేడు ఆకులే తిని, నీరు మాత్రమే త్రాగినా ఆరోగ్యంగానే ఉంది. శ్రీవారిని అమితంగా ప్రేమించే కొంతమంది భక్తులు ఇదంతా చూసి కదిలిపోయారు. వారు అన్నారూ -
" మానవజన్మ ఏపాటిది ? ఇలాంటి ఆవులా పుట్టినా ఈ జన్మలోనే మోక్షం లభించేది. ఈ ఆవు గతజన్మలలో ఎంత పుణ్యం మూటగట్టుకుందో ఎవరు చెప్పగలరు ?"
పరమాచార్యుల స్మృతులు : నిమ్మకాయ
పరమాచార్యుల స్మృతులు : నిమ్మకాయ
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)
శ్రీవారు తేనంబాకంలో విడిది చేస్తున్నప్పటి సంగతి. నేనూ అక్కడే వారి సేవలో ఉండేవాణ్ణి. మా అన్నయ్య నాతో మా నాన్నగారి ఆబ్దీకం ఏ రోజు వచ్చిందో చెప్పాడు. ఆబ్దీకం ముందురోజు నేను శ్రీవారివద్దకు వెళ్ళి సెలవు కోరాను.
"నువ్వెందుకు వెళ్ళాలి ? మీ అన్నయ్య ఆబ్దీకం నిర్వహిస్తాడు. నీకు నేనున్నానుగా!" . శ్రీవారు అప్పుడప్పుడూ చిన్నపిల్లాడిలా మాట్లాడుతారు.
"నేను ఆ రోజే, రాత్రికల్లా, తిరిగి వచ్చేస్తాను".
శ్రీవారు ఒక నిమ్మకాయ తెమ్మని, దాన్ని చేతిలో పట్టుకుని అప్పుడప్పుడూ వాసనచూస్తున్నారు.
తరువాతరోజు ఉదయమే నేను ప్రయాణానికి సిద్ధమై, శ్రీవారికి సాష్టాంగం చేశాను. శ్రీవారి నాకు నిమ్మకాయ ఇచ్చారు. నేను బయలుదేరాను. ఐదున్నరకల్లా బయలుదేరవలసిన బస్సు ఎక్కి కూర్చున్నాను. నిముషాలుగడుస్తున్నాయి కానీ బస్సు కదిలే సూచనలేమీ కనిపించట్లేదు. వయసుపైబడిన మా అమ్మ, అన్నయ్య నాకోసం ఇంట్లో వేచిఉన్నారు, నేనేమో బస్సు కదలటం కోసం. కంగారు పెరిగిపోతోంది. ఇంక ఆగలేక, కండక్టరుని ఆలస్యానికి కారణమేంటని అడిగేశాను.
"నాకు ఓ నిమ్మకాయ కావాలి. ఏ రోజైనా బస్సులో నిమ్మకాయ పెట్టిన తరవాతే, బస్సు కదుపుతాము. ఓ అబ్బాయిని నిమ్మకాయ కోసం దుకాణదారుడి వద్దకి పంపాను, ఆయనవల్ల ఈ రోజు ఆలస్యం"
"ఇదుగో నిమ్మకాయ, ఇంక బయలుదేరుదాం", అన్నాను.
"శ్రీవారు ఇచ్చారా ఇది ? స్వామియే ఇచ్చుంటారు", డ్రైవరు చాలా గౌరవంతో ఆ నిమ్మకాయ తీసుకుని, బస్సు నడపటానికి సిద్ధమయ్యాడు.
ఈ నిమ్మకాయతో శ్రీవారు నిన్నటినుంచీ ఏం పరిహాసం చేశారు !
Friday, 1 December 2017
సాక్షాత్తూ పరమేశ్వరుడే
సాక్షాత్తూ పరమేశ్వరుడే
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)
మేమప్పుడు మైలాపూరులో ఉండేవాళ్ళం. ప్రతీరోజూ ప్రొద్దున్నా, సాయంత్రం - రోజుకి రెండు సార్లు - నేను శివదర్శనానికి కపాలేశ్వరుని దేవాలయానికి వెళ్ళేవాడిని.
పరమాచార్యులకి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి వచ్చేది. రామకృష్ణయ్యరు - హోమియోతెలిసినవారు, వైద్యుడు కాదు - తన హోమియో నిఘంటువు చూసి ఏవో బల్లిగుడ్లలాంటి తెల్లని చిన్న గోళీలు ఇచ్చేవారు. స్వామివారు అవి రెండు రోజులు తీసుకొన్న తరువాత కొంత ఉపశమనం ఉండేది. అయ్యప్ప, శబరిమల ప్రాచుర్యంలోకి వస్తున్న రోజులవి. నల్లధోవతులు కట్టుకుని జనాలు గుడికి వచ్చేవారు. మాకు నల్ల దుస్తులంటే ద్రవిడకజగం (రాజకీయపార్టీ) కి సంబంధించినవిగా మాత్రమే తెలుసు. దాంతో నేను కొంత ఆశ్చర్యపోయాను. కొంతమందిని అడిగితే ఒక వ్యక్తి నాతో ఇలా అన్నాడు - "నీకు తెలియదా ? మేము శబరిమల వెడుతున్నాం. ఎంతో శక్తివంతమైన దేవుడు. పిల్లల్లేనివారికి సంతానం కలుగుతుంది. అనారోగ్యం నయమవుతుంది. నిశ్చయంగా ఒక సజీవ దేవత".
అప్పట్లో నేను చిన్నవాణ్ణి, బోలెడు భక్తి ఉంది. ఇది 35 ఏండ్ల క్రింది మాట. పరమాచార్యులకి ఛాతీనొప్పి నయమవటానికి నేను శబరిమల యాత్ర చేస్తానని మొక్కుకున్నాను. నేను స్వాములవారి దగ్గరకు వెళ్ళి నేను శబరిమల వెడుతానని మ్రొక్కుకున్నాననీ, వారి దీవెనలూ అనుగ్రహము కావాలనీ అడిగాను.
"శబరిమల ఏంటి ? ఈ అకస్మాత్తు కోరిక ఏంటి ? నువ్వు నాతో ఉండగా యాత్రలెందుకు ? నన్నెందుకు అడుగుతున్నావు ?"
"నేను మ్రొక్కుకున్నాను, అది తీర్చుకోవాలి. శ్రీవారు దయచూపాలి"
శ్రీవారు ఒక గుడ్డతీసి నాపైకి విసిరారు. "ఇదివరలో శబరిమలకి తెల్లధోవతులతోనే వెళ్ళేవాళ్ళు. బ్రాహ్మణులు మద్యమాంసాలకు దూరంగా ఉంటారు. కాబట్టి శబరిమలకు వెళ్ళటానికి విశేష కట్టుబాట్లు అవసరం లేదు. నలుపు ధరించటం ఈమధ్య వచ్చిన ఆనవాయితీ. సంవత్సరం పొడవునా మద్యమాంసాలు సేవించేవారు, వారి పశ్చాత్తాపానికి సూచనగా నలుపు ధరించటం మొదలయ్యింది. నీకు అవసరం లేదు. గుడిలోకి వెళ్ళినప్పుడు ఈ తుండు నీ చుట్టూ కట్టుకో. మరోమాట. నేను చెప్పినట్లే చెయ్యాలి. ఒక వంద నిమ్మకాయలు కొనుక్కుని, నీతో ఒక చేతిసంచీలో తీసుకువెళ్ళు. ఈ తాజా నిమ్మకాయలు తప్ప వేరే ఏమీ తినకూడదు. వీటి రసం తీయకూడదు. పచ్చిగానే తినాలి".
ఆ నిమ్మకాయలు మాత్రం తింటూ నలభై రోజులు ఉన్నాను. శ్రీవారి కరుణవలన నాకు అది సరిపోయింది. నేను వెళ్ళటానికి సిద్ధమయి నాగరాజయ్యర్ కారులో శబరిమల బయలుదేరాము.
కొండ పైన గుడిలో 18 మెట్లకీ 18 కొబ్బరికాయలు కొట్టాను. భక్తులు అక్కడి పూజారి వద్దకు ప్రసాదానికై వెడుతున్నారు. నేను కూడా శ్రీవారికోసం ప్రసాదం ఆ పూజారిని అడిగాను. శ్రీవారికోసమే కదా వచ్చింది ?
"ఎక్కడనుంచి వస్తున్నావు ?"
"నేను పరమాచార్యుల సేవకుడిని"
"ఓ, పరమపూజ్యులు వారు"
" అవును, వారు పరమపూజ్యులు"
"వారి వల్లనే మేము బాగున్నాము. మాకు కోట్లరూపాయల ఆదాయం, అంతా సక్రమంగా జరుగుతోంది"
"నాకు కొంత ప్రసాదం కావాలి"
వెంటనే ఆ పూజారి ఒక పెద్ద నెయ్యి డబ్బా తీసుకుని, ఆ డబ్బాడు నెయ్యీ విగ్రహంపై పోశారు. సుమారు కేజీన్నర పట్టే సీసా తీసుకుని, దాని నిండా ఆ నేతిని పట్టారు. తరువాత తమ రెండు చేతులనిండా విభూతి తీసుకుని విగ్రహానికి అభిషేకించారు. ఇలా రెండుసార్లు చేసి, ఆ విభూతిని సేకరించి నాకు ఇచ్చారు. నేను ప్రసాదాన్ని జాగ్రత్త చేసుకున్నాను. సాష్టాంగం చేసి అయిదువందల రూపాయలు సమర్పించాను. నాకోసం రెండు సీసాల అరవణ పాయసం కొనుక్కున్నాను. యాత్ర అయిపోయింది కదా, నేను తినవచ్చు. నా తిరుగు ప్రయాణం మెదలుపెట్టాను.
తిరుగు ప్రయాణం ఎర్నాకులం మీదుగా వచ్చాను. ఏ మార్గంలోనైనా వెనక్కిరావచ్చు. రెండు మార్గాలున్నాయి. వందిపెరియార్ మీదుగా ఒకటి, సలక్కాయం మీదుగా రెండోది. నేను సలక్కాయంమీదుగా ఎర్నాకులం వచ్చాను. నాతో దర్శనానికి వచ్చిన ఒక న్యాయవాది - నాకు బాగా తెలిసినవాడు, స్నేహితుడూ - నన్ను వారి ఇంటికి తీసుకునివెళ్ళాడు. భోజనం అయ్యాక బయలుదేరబోతోంటే అతను ఇలా అన్నాడు. " నువ్వు నిరాకరించకూడదు. మా అమ్మ, తొంభై ఏళ్ళది, ఈ ప్రక్కనే ఓ పల్లెటూళ్ళో ఉంటోంది. శ్రీవారి దగ్గరవారిని చూస్తే చాలా సంతోషిస్తుంది. మనం అక్కడకు వెళ్ళిన తరువాత నువ్వు బయలుదేరవచ్చు."
మేము కొల్లెనగోడు అనే ఆ పల్లెటూరికి బయలుదేరాము. ఆ తల్లి నన్ను చూచి చాలా సంతోషించింది. ఆవిడ పేరు అంగచ్చి, వాళ్ళు నంగవరం వారు. కాఫీ ఇవ్వబోయి, నేను వద్దంటే మజ్జిగ ఇచ్చింది. కాసేపైనతరువాత నేను బయలుదేరబోతోంటే ఆమె ఇలా అంది - " కృష్ణయ్యర్ మామ ను కలువకుండా ఎలా వెడతావు ? ఓ పిల్లాడా, ఇలావచ్చి ఈ అబ్బాయిని కృష్ణయ్యర్ మామ దగ్గరకు తీసికెళ్ళు "
నాకు కృష్ణయ్యరూ తెలియదు, రామయ్యరూ తెలియదు. సరే, మేము బయటకి వెళ్ళి వీధికి అవతలప్రక్కన ఉన్న ఇంట్లోకి వెళ్ళాము. అక్కడ ఓ పడకకుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న తొంభై అయిదు ఏండ్ల ఒక వృద్ధుడిని చూశాను.
"ఓయ్ రాజూ, ఎవరిది ?"
నన్ను పరిచయం చేశారు. "నేను పరమాచార్యుల సేవకుడిని" అన్నాను.
ఆయన అమాంతం కుర్చీలోంచి లేచి, సాష్టాంగం చేసి నా పాదాలు పట్టుకున్నారు. నేను నిర్ఘాంతపోయి వెనక్కిదూకాను.
"మీరిలా చెయ్యకూడదు. మీరా పెద్దవారు, నేనో, చిన్నవాణ్ణి, ఇలా చేయడం దోషం"
"నేను సాష్టాంగం చేసింది నీకు కాదు, శ్రీవారికి. ఆ సర్వేశ్వరుడికి. శ్రీవారు సాక్షాత్తూ ఈశ్వరుడని నీకు తెలియదా ? ఆ భగవంతుడే అని తెలియదా ? తంజావూరువాళ్ళు సాధారణంగా తెలివైనవారు, నువ్వేమో తెలివితక్కువవాడిలా ఉన్నావే ?"
"మీరలా ఎలా అంటున్నారు ? అందరూ అంటున్నారనా ? అందరూ శ్రీవారిని పొగిడేవారే "
"విను. చాలా దశాబ్దాలక్రితం శ్రీవారు కేరళ వచ్చి మా ఊరిలో నలభై అయిదు రోజులు ఉన్నారు. ప్రతీ ఉదయం శ్రీవారు మూడింటికల్లా లేచి ఒక గంట జపం చేసేవారు. తరువాత స్నానమూ, నిత్యకృత్యాలూ, చంద్రమౌళీశ్వరపూజా చేసేవారు. తరువాత ఒక అయిదునిముషాలలో వారు హడావిడిగా భోజనం అయిందనిపించేవారు. వెంటనే భక్తులవద్దకు వచ్చి, ఏదైనా ఆధ్యాత్మికవిషయం పై ఉపన్యసించేవారు. రోజూ ఇలాగే నడిచేది - పూజ, ప్రసాదం, అంతులేకుండా భక్తులను కలవటం - మళ్ళా మధ్యాహ్నమూ ఇదే, సాయంత్రమూ ఇదే, రాత్రీ ఇదే. వారు ఏమీ తినేవారే కాదు, మూడు గంటలకు మించి నిద్రపోయేవారూ కాదు. ఒకరోజు నేను శ్రీవారిని ఇలా ప్రార్థించాను.
"శ్రీవారు నాకోసం ఒక పని చెయ్యాలి"
"ఏమిటది ?"
"శ్రీవారు సాక్షాత్తూ గురువాయురప్ప, ఎర్నాకులట్టుఅప్పన్, వేరు కాదు. ఈ అంతులేని శ్రమ, నిద్రలేకపోవటం శ్రీవారి శరీరంలో ఉష్ణం కలిగించింది. ఈ వేడి వలన కళ్ళు బాగా ఎర్రగా ఉంటున్నాయి. శ్రీవారు, తమకు తైలస్నానం చేయించటం కోసం నాకు అనుమతినివ్వాలి. కేరళ ఔషధతైలాలకి ప్రసిద్ధి. శ్రీవారు కరుణించి నాకు ఈ అనుమతినివ్వాలి".
"సరే అయితే", అన్నారు శ్రీవారు, "శనివారం రా ".
నేను మూలికలూ, వేళ్లను ఉపయోగించి తైలం తయారుచేసి, శనివారం శ్రీవారి వద్దకు తీసుకుని వెళ్ళాను. శ్రీవారు నన్ను ఈ తైలం వారి తలపైనా, శరీరం పైనా మర్దించాను. అప్పుడు వారి శిరస్సుపై చక్రవర్తిరేఖ చూశాను. చేతులపై శంఖచక్రముద్రలున్నాయి. పాదముల మడమలపై పద్మరేఖ చూశాను. నువ్వు తంజావూరువాడినంటున్నావు. తంజావూరువాళ్ళు తెలివైనవారు, నీకు తెలివిలేనట్టుంది. శ్రీవారిని సేవిస్తానంటున్నావు, ఆయన శరీరంపై ఈ రేఖలు చూడలేదా ? వారుకూడా అందరిమల్లేనే మలమూత్రవిసర్జన చేస్తారు అని మోసపోకు. ఆయన నిన్ను వెర్రివాడిని చేస్తున్నారు. శ్రీవారు సాక్షాత్తూ ఈశ్వరుడు తప్ప వేరుకాదు. "
ఆ వృద్ధుడు నాతో అలా అన్నారు. కాస్సేపయ్యినతరువాత నేను వెళ్ళటానికి లేచాను. నన్నొక్కనిముషం ఉండమని ఆయన లోపలికి వెళ్ళారు. లోపలినుండి పద్ధెనిమిది రుద్రాక్షలను పట్టుకొచ్చారు. అందులో ఏకముఖి నుండి పద్ధెనిమిది ముఖాలున్న రుద్రాక్షవరకూ ఉన్నాయి. అవన్నీ నా చేతిలో ఉంచి, ఆయన అన్నారు - " తీసుకోవయ్యా, ఇవి నావద్ద చాలాకాలంగా ఉంచాను. నువ్వు తీసుకోవాలి".
నేను రుద్రాక్షలు తీసుకున్నాకా, ఆయన నా చెయ్యిపట్టుకుని "నువ్వు నాకో మాట ఇవ్వాలి" అన్నారు.
"ఏమని మాట ఇవ్వాలి ?"
"చివరి శ్వాస వరకూ శ్రీవారిని సేవిస్తానని. ఇతరులు నిన్ను ఇబ్బంది పెడతారు. వదిలించుకోవటానికి చూస్తారు. ఓ దుర్మార్గుడు వచ్చి నిన్ను తరిమేయవచ్చు. పట్టించుకోవద్దు. మఠం బయట ఒక స్టూలు వేసుకుని శ్రీవారిని కనిపెట్టుకుని ఉండు. వదలద్దు సుమా. నమ్మకస్థుడైన సేవకువై ఉండు, వదిలిపెట్టద్దు. "
నాకు ఆయన మజ్జిగ ఇచ్చారు.
"మరో మాట. శ్రీవారికి నా ప్రార్థనగా నడవవద్దన్నానని చెప్పు. వారు చాలా నడుస్తారు. ఆ పాదాలపై రేఖలు చెరిగిపోతే ప్రపంచానికే అరిష్టం. కాబట్టి నడువకూడదు. ఇంకో విషయం. వారికి నా తరపున ఇరవై నాలుగు సాష్టాంగాలు చెయ్యి".
నేను మాట ఇచ్చి బయలుదేరాను.
టాక్సీలో ప్రయాణం చేశాను. శ్రీవారు ఒక అడవి మధ్యలో ఉన్న కట్టుకోడిపురం అనే ఊరిలో - బహుశ నాగలాపురం దగ్గరనుకుంటా - ఉన్నారు. ప్రయాణం చాలా కష్టమయ్యింది. రోడ్డు ఎత్తుపల్లాలతో ఉంది. చాలా కష్టంమీద శ్రీవారి వద్దకు చేరాను. శ్రీవారు ఓ గోనెపట్టాపై విశ్రాంతి తీసుకుంటున్నారు. నేతినీ, విభూతినీ వారెదురుగుండా ఉంచి, సాష్టాంగం చేశాను. వెంటనే శ్రీవారు ఆ కేజీన్నర నెయ్యి సీసామూత తీసి ఒక్కగుటకలో నేతినంతా తినేశారు. ఆకులో చుట్టబడిన విభూతి అంతా తన తలపై ఒంపేసుకున్నారు. నేనేమీ మాట్లాడకముందే శ్రీవారు నాతో ఇలా అన్నారు.
"అయితే నువ్వు శబరిమల వెళ్ళావా ? కృష్ణయ్యరు నీతో ఏం చెప్పాడు ?"
"శ్రీవారు సాక్షాత్తూ పరమేశ్వరుడేనని చెప్పారు"
ఒక్క క్షణంలో శ్రీవారు లేచి నుంచుని దండం పట్టుకున్నారు. ఆరడుగుల పొడవని తోచింది. కళ్ళు చింతపిక్కల్లా ఎర్రగా ఉన్నాయి. ఆయన నిజంగా శూలపాణి అయిన పరమేశ్వరుడే.
"అలా అన్నాడా ? అన్నాడా ?"
"అవును. శ్రీవారి పాదాలపై రేఖలు చెరిగిపోతే ప్రపంచానికే అరిష్టం. కాబట్టి నడువకూడదని ప్రార్థిస్తున్నానని చెప్పమని కూడా అన్నారు"
"రేఖలు చెరిగిపోవని చెప్పు. నేను పాదుకలు ధరిస్తానని చెప్పు. ఫోన్ చేసి చెప్పు". తరువాత నేను కృష్ణయ్యరు గారికి ఫోన్ చేసి శ్రీవారి సందేశం తెలియపరచాను.
అప్పుడు నేను కృష్ణయ్యరుగారిచ్చిన రుద్రాక్షలు శ్రీవారికి ఎదురుగా ఉంచి సమర్పణ చేశాను.
"ఇవి నీకు ఇచ్చినవి"
"నేను ఆ కానుకకు అర్హత లేనివాణ్ణి. అజ్ఞానిని. శ్రీవారు మాత్రమే ధరించయోగ్యమయినవి "
" ఇలా ఎలా ధరించను ?"
"నేను వీటిని ఒక మాలగా తయారు చేయిస్తాను" అని, ఒక చక్కటి మాల తయారు చేశాను. శ్రీవారు దానిని ధరించారు కూడా. ప్రదోషం రోజుల్లో శ్రీవారు రుద్రాక్షలు ధరించేవారు. తరువాత ఆ మాలను బాలస్వామివారికి ఇచ్చారు. కానీ నేనెప్పుడూ బాలస్వామివారు వాటిని ధరించగా చూడలేదు, పూజలో కూడా. జయేంద్ర స్వామివారు ప్రదోషం రోజుల్లో తప్పనిసరిగా రుద్రాక్షలు ధరిస్తారు.
"నేను శ్రీవారిని ఒకటి అడగాలని కోరుకుంటున్నాను"
"ఏం కోరుకుంటున్నావో అడుగు"
"రామయ్యర్లూ, కృష్ణయ్యర్లూ శ్రీవారి శిరస్సుపై తైలం అలదారు, శరీరంపై రేఖలు చూశారు. శ్రీవారితో ఎప్పుడు ఉండి సేవించుకునే మేము మాత్రం ఎప్పుడూ ఏమీ చూడలేదు"
శ్రీవారు కాళ్ళుజాపి ముందుకు వంగారు.
"నా తలమీద, కాళ్ళమీద ఉన్న రేఖలు చూడు. దగ్గరగా రా, కావాలంటే రేఖలని ముట్టుకో. నేనేమైన పోలీసునా ? టీటీ నా? నేనేం చేస్తాను ? ’శంకరాచార్యులకు తలపై ఈ రేఖలు ఉన్నాయి’ అని వ్రాయబడిన బోర్డు మెడచుట్టూ తగిలించుకోనా ? "
నేను శ్రీవారి తలపైనా పాదములపైనా ఉన్న రేఖలని స్పర్శించాను.
కరుణామూర్తి అనేపదం ప్రపంచంలో శ్రీవారికి మాత్రమే వర్తిస్తుంది. శ్రీవారి దయ వేరొకరికి ఉండదు.
Monday, 27 November 2017
అప్పయ్యదీక్షితుల శివకర్ణామృతము (1 - 5)
అప్పయ్యదీక్షితుల శివకర్ణామృతము
(1 - 5)
శ్రీ పార్వతీసుకుచకుఙ్కుమరాజమాన
వక్షస్థలాఞ్చితమమేయగుణప్రపఞ్చమ్ |
వన్దారుభక్తజనమఙ్గలదాయకం తం
వన్దే సదాశివమహం వరదమ్మహేశమ్ ||
శ్రీ పార్వతి వక్షస్థలమునందలి కుంకుమతో (పరస్పరాలింగనముద్వారా) శోభిల్లుతున్న వక్షస్థలము కలవాడూ, అనంతములైన గుణములు కలవాడూ , నమస్కరించు భక్తజనులకు శుభములను, వరములను ప్రసాదించువాడూ అగు మహైశ్వర్యములుగల సదాశివునకు నమస్కరించెదను.
నన్దన్నన్దనమిన్దిరాపతిమనోవన్ద్యం సుమన్దాకినీ
స్యన్దత్సున్దరశేఖరం ప్రభునుతమ్మన్దారపుష్పార్చితమ్ |
భాస్వన్తం సురయామినీచరనుతం భవ్యమ్మహో భావయే
హేరమ్బం హిమవత్సుతామతిమహానన్దావహం శ్రీవహమ్ ||
ఎల్లరనూ సంతోషింపచేయుకుమారుడూ (లేదా ఎల్లరనూ సంతోషింపచేయు నందనవనమునే సంతోషింపచేయువాడూ), విష్ణువుచే మనస్సున నమస్కరింపబడువాడూ, ఆకాశగంగను చిందించు సున్దరకేశపాశము గల వాడూ, మందారపుష్పములతో పూజింపబడువాడూ, రాజులచేత, దేవదానవులచేతనూ స్తుతింపబడువాడూ, గొప్ప తేజోమూర్తీ, పార్వతికి మహానన్దమును కలిగించువాడూ, జ్ఞానసూర్యుడై ప్రకాశించుచున్న వినాయకుడిని ధ్యానించుచున్నాను.
ఆలోక్య బాలకమచఞ్చలముచ్చలత్సు
కర్ణావిబోధితనిజాననలోకనం సః |
సామ్బస్స్వమౌలిసుభగాననపూత్కృతై స్త
మాలిఙ్గయన్నవతు మామలమాదరేణ ||
బాగుగా కదలుచున్న చెవులవలన తన ముఖము కనుబడకున్నా అచంచలుడైన వినాయకుని చూచి, ఆదరముతో తన శిరముపైనున్న గంగా తరంగములతో (అవియే చేతులుగా) ఆలింగనముచేసుకున్న శివుడు నన్ను రక్షించుగాక. ఇది చాలును.
కణ్ఠోత్పలం విమలకాయరుచిప్రవాహ
మర్థేన్దుకైరవమహం ప్రణమామి నిత్యమ్ |
హస్తామ్బుజం విమలభూతిపరాగరీతి
మీశహ్రదం చటులలోచనమీనజాలమ్ ||
దీక్షితులు శివుని ఒక మంచినీటి చెరువుతో పోల్చుచున్నారు. అతని కంఠం నల్ల కలువ. దేహకాంతి ప్రవాహము. శిరమునందలి అర్ధచంద్రుడు తెల్ల కలువ. చేతులు కమలములు(ఎర్రనివి). శరీరము నందలి తెల్లని విభూతి పూత పుప్పొడి. ఆయన కన్నులు చేపలు. కావున శివుడొక హ్రదమే అయి ఉన్నాడు. ఆయనకు ప్రతిదినమూ మ్రొక్కెదను.
రఙ్గత్తుఙ్గతరఙ్గసఙ్గతలసద్గఙ్గాఝరప్రస్ఫుర
ద్భస్మోద్ధూలితసర్వకాయమమలమ్మత్తేభకృత్యావృతమ్ |
ఆరూఢం వృషమద్భుతాకృతిమహం వీక్షే నితమ్బస్ఫుర
న్నీలాభ్రచ్ఛురితోరుశృఙ్గమహితం తం సన్తతమ్మానసే ||
భస్మోద్ధూళితమైన అయిన శివుని శరీరము ఉత్తుంగ తరంగముల గంగా ప్రవాహంచే ప్రకాశించుచున్నది. అద్భుతాకారముగల వృషభమును అధిరోహించి, గజచర్మముచే చుట్టబడిన నితమ్బమూ, క్రిందిభాగమూ, నీలమేఘముచే ప్రకాశించు పర్వతమో అన్నట్లున్న ఆ శివుని ఎల్లప్పుడూ నా మనసున దర్శించుచున్నాను.
Sunday, 17 September 2017
శివుడు మిమ్ము రక్షించుగాక
కైలాసాద్రా వుదస్తే పరిచలతి గణే షూల్లసత్కౌతుకేషు క్రోడం
మాతుః కుమారే విశతి విషముచి ప్రేక్షమాణే సరోషమ్
పాదావష్టమ్భసీదద్వపుషి దశముఖేయాతి పాతాళమూలం
క్రుద్ధోఽప్యాశ్లిష్టమూర్తిర్భయఘన ముమయా పాతు తుష్టః శివో వః
రావణుడిచే పైకెత్తబడిన కైలాసము అల్లలనాడుచుండగా, ప్రమథగణములకు ఇదియేమను కుతూహలం పెరుగుచునుండగా, కుమారస్వామి (భయమువలన) తల్లి ఱొమ్మున చొరగా, వాసుకి కోపముతో చూచుచుండగా, శివుడు (కోపముతో) కాలితో అదుముటచేత రావణుడు పాతాళమునకు పోవుచుండగా, (రావణునిపై) కోపించినవాడయ్యునూ పార్వతిచేత భయమువలన గట్టిగా ఆలింగనము చేసికోబడ్డవాడై ఆనందించిన శివుడు మిమ్ము రక్షించుగాక.
Subscribe to:
Posts (Atom)
ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది
ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.