Thursday 7 September 2017

పరమాచార్యుల అమృతవాణి : అవసరానికి మించి ఖర్చుచేయరాదు



పరమాచార్యుల అమృతవాణి : అవసరానికి మించి ఖర్చుచేయరాదు
(జగద్గురు బోధలనుండి)

దైవభక్తి ఆవశ్యక మని చెప్పడ మెందుకు? ప్రతివాడు ఆత్మానుభవం కలిగి జన్మ రాకుండా చేసికోవడానికే. అట్టి ఆత్మసాక్షాత్కారానికై మొదటి మెట్టు యమం. యమంలో ఒకటియే అపరిగ్రహం. మనుష్యులు తమ అక్కరకు మించి ఒక పూచిక పుల్లయినా వాడరాదు. అదే అపరిగ్రహం. అపరిగ్రహం ఆత్మసాక్షాత్కారానికి సాధనం.

ఇపుడు మనుష్యులకు అక్కఱ లేని అనే ప్రశ్న వస్తుంది. 'ఛాయా తోయం వసన మశనం' అని పెద్దలన్నారు. కడుపునకు కూడు, తాగడానికి నీరు, ఉనికికి ఒక పూరిపాక, కట్టుకోడానికి ఒక గుడ్డ. ఇవి ముఖ్యావసరాలు. ప్రాణాలు కాపాడుకోడానికి ఈ నాలుగున్నూ పరికరాలు. ఇవి అన్నీ భూమినుండి ఉత్పన్నమవుతై. నీ రిచ్చేది భూమి. ఇండ్లు కట్టుకోడానికి మన్ను సున్నం దారువు లోహం ఇత్యాదులు భూమిలోనుండి వచ్చేవే. ఇక ఆహారం, పత్తితో నేయబడిన వలువలు. ఇవన్నీ భూమినుండి వచ్చేవే. కడపట మనము కలిసేదికూడా ఆ భూమిలోనే.

సృష్టిలో మనకు దొరికే ఈ వస్తువులను పొదుపుగా వాడుకోవాలి. మానరక్షణకోసం మనం బట్టలుకట్టుకుంటాం. పత్తితో గట్టిగా నేయబడిన బట్టలతో మనకు ఆ ప్రయోజనం తీరుతుంది. ఆడంబరంగా ఉండాలని వెలగల దువ్వలువలు కట్టుకొనకపోతేయేం? అట్లా కట్టుకుంటేనేగాని ఇతరులు గౌరవంతో చూడరని దురభిప్రాయంగాక ఇందుకు వేరే కారణం ఉందా? వెలగలవానిని కట్టుకోవడంచేతనే మానరక్షణ జరుగుతుందని అనగలరా?

ఒక కుటుంబం, వెలగల వలువలకై చెసే ఖర్చుతో దాదా పయిదు కుటుంబాలకు కావలసిన సాధారణాలయిన బట్టలు దొరుకుతై. ఆడంబరంకోసం కట్టే బట్టలు పట్టుబట్టలే అయివుంటే అవి మనకు పాపాన్నే పోగుచేసి పెడతై. వీని కోసం ఎన్ని జీవాలనో హింసించవలసి వస్తున్నది. అహింస అహింస అని చెపుతూ మనం మాంసం ముట్టం. కాని మాంసాహారానికయితే ఏ ఒక జీవానికో హింస. పట్టుబట్టకు ఒకటింటికి లక్షలాది జీవాలను చంపాలి. మనము కట్టుకొనే బట్టలు సాధ్యమయినంతవరకు హింసచేయకుండా ఉండే ఉపాయాలవల్ల ఉత్పత్తి అయేవిగా చూచుకోవాలి. మనము కట్టె బట్టలు సాధారణు లందరూ కట్టుకొనేటటువంటివిగానూ గట్టివిగానూ ఉండాలి.

ప్రజలందరూ సుఖంగా బతకటానికి ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టాలు చేస్తుంది. కాని లేమికిమాత్రం దినదినాభివృద్ధి. ప్రజల ఆర్థికజీవనం ఎంతో పెరిగిందని మురిసిపోతారు: దానికి గుర్తు ఏమిటయ్యా అంటే ఇదివరకు రెండుసార్లు కాఫీ తాగేవారిప్పుడు నాలుగు సారులు కాఫీ తాగడం. గుడిసెలలో ఉండేవారు మేడలలో ఉండడం. రెండు బట్టలతో కాలం గడిపేవారు ఇరవై బట్టలు సేకరించి ఉంచుకోడం. ఆర్థికజీవ నాభివృద్ధికి ఇవి గుర్తు లని అనుకోవడం సరికాదు. మనకు కావలసినవస్తువు లన్నిటినీ ఇలా పెంచుకుంటూనేపోతే దేశంలో ఎపుడూ లేబరమే తాండవిస్తూవుంటుంది. మానప్రాణాలు కాపాడుకోవడాని కేవి తప్పనిసరో అట్టివి అందరకూ అందుబాటులో ఉండాలి. అందులకే దిట్టమయిన చట్టాలుండాలి. ఆలాటి స్థితి కలగాలి, అది సవ్యమయినది. అని అనుకుంటే పరమదరిద్రులు తమ జీవితం ఎల్లా గడుపుకొంటారో అలాగే వసతి వాడలున్న శ్రీమంతులు కూడా గడుపుకోడానికి ప్రయత్నించాలి. దరిద్రులు గుడిసెలలో ఉంటే శ్రీమంతులు కూడా గుడిసెలలో ఉండాలి. పొద్దున్నే అతడు గంజి తాగితే ఇతడున్నూ వెసులుబాటు ఉన్నదని కోరికలు పెంచుకోక గంజి తాగాలి. దానినే అపరిగ్రహమని అంటారు. అపరిగ్రహంలేని దోషం ఉండేటంతవరకూ ఈశ్వరానుగ్రహం కలగదు. జన్మ సాఫల్యంకోరేవారు తమతమ అవసరాలు మించి ఒకింతయినా పరిగ్రహం చేయరాదు. కలిగినవారు లేనివారికి సాయంచేయడమే పుణ్యం. అదే వారికి మోక్షప్రదం. ఈసంగతి తెలియక ఇంత ఉన్నవారు తమకు నచ్చిన పట్టుబట్టలు కట్టుకొని తిరిగితే వీరినిచూచి లేనివారుగూడా వారివలె తిరగడానికి ప్రయత్నిస్తారు, అట్లా వారిని అనుకరించి అప్పులపాలవుతారు. పట్టుపుట్టాలవారు. చెడిన తరగతిలోనివారే. ఇక వజ్రాల నగలవారున్నారు. ఇందులకై చేసే వ్యయమంతా పచ్చి దుబారా. కన్యాం 'కనకసంపన్నాం' అని కన్యాదానం చేసేటప్పుడు స్వర్ణం ఇవ్వడం వాడుక. బంగారంకోసం డబ్బువెచ్చపెట్టి నగగా పెట్టుకొన్నా ఏనాటికయినా అది ఉపయోగపడుతుంది. కాని వజ్రాలకు ఇట్టి ప్రయోజనంలేదు. సరికదా ఉపద్రవం కావలసినంత. ఏబది, నూఱేండ్లక్రితం మనపూర్వులు కాఫీ ఎరగరు. వారి కాపురం గుడిసెలలోనే చెవులకు తాటికమ్మలే. తాగేది రాగిగంజో బియ్యపుగంజో. బ్రతుకుతెరువులో ధనికులకూ దరిద్రులకూ పెద్ద భేదమేమీ ఉండేదికాదు.

'ఇకమీద కాఫీతాగను, పట్టుబట్టలు కట్టను' అని సంకల్పం చేస్తే దానివల్ల మిగిలేధనంతో అయిదు కుటుంబాలు సుఖంగా బ్రతుకుతై. జీవిత సదుపాయానికి మనం ఎక్కువ వస్తువులను సేకరించినకొద్దీ శాంతీ ఉండదు. సౌఖ్యమా ఉండదు. ఇట్టి దుబారావల్ల మళ్ళా దారిద్ర్యం తప్పదు, దుఃఖంతప్పదు. కాఫీనీ పట్టుబట్టలనూ వదలిపెడితే అన్ని కుటుంబాలూ బాగుపడతై. ఇదేకాదు, పట్టుబట్టలకోసం చేసేపాపం ఉండదు. అది లేకుంటే మోక్షానికి శ్రమయే లేక పోతుంది. అష్టాంగయోగంలో మొదటిదే అపరిగ్రహం, అహించ అనేవి. ఏ ప్రాణికిన్నీ మనవల్ల హింసకలుగరాదు. డబ్బు ఉందికదా అని అనవసరమైన వస్తువులకు దుబారా చేయరాదు. అట్లాచేసే వ్యయంతో లేమితో కొట్టుకోనే వారి అవసరాలు తీర్చవచ్చు, అలాచేస్తేనే, చేయడానికి ఉంకిస్తేనే తొందరగా బ్రహ్మసాక్షాత్కారానికి దాపుతోవ దొరుకుతుంది. అష్టాంగయోగానికి మొదటిసోపానం అది దానిని ఎక్కక పై సోపానానికి పోవడం అసంభవం అని విశదీకరించడానికే దీనిని చెప్పడం.

No comments:

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.