Saturday 29 October 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 46 - 50



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 46 - 50

ఆకీర్ణే నఖరాజికాన్తివిభవైరుద్యత్సుధావైభవై-
రాధౌతేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే ।
నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్ఛావిహారం కురు
స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాఙ్ఘ్రిసౌధాన్తరే ॥ 46 ॥


పరమేశ్వరుని పాదపద్మములు ఒక భవంతిగానూ, ఆ భవంతిలో పరమహంసలు శాశ్వతవాసులై ఆ పాదపద్మములను సేవించుచున్నట్లుగానూ, మన మనస్సులనే హంసలుకూడా ఆ భవనములో‌ భక్తి భార్యతో కలిసి నివసించవలెననీ శంకరులు ఉపదేశిస్తున్నారు.

పరమేశ్వరుని పాదపద్మములందలి నఖములు ధవళకాంతులీనుతున్నవి. (జటాజూటము నందలి) చంద్రునినుండి అమృతము స్రవించి ఆ పాదములను కడుగుచున్నది. ఆ పాదములు పద్మపువన్నె కలిగి మిక్కిలి అందముగానున్నవి. పరమహంసలు సమూహములుగా ఆ పాదములను సేవించుచున్నారు. ఓ మనస్సా! నీవునూ ఆ పరమేశ్వరుని పాదపద్మములను భక్తితో ఆశ్రయింపుము.

శంభుధ్యానవసన్తసంగిని హృదారామేఽఘజీర్ణచ్ఛదాః
స్రస్తా భక్తిలతాచ్ఛటా విలసితాః పుణ్యప్రవాలశ్రితాః ।
దీప్యన్తే గుణకోరకా జపవచఃపుష్పాణి సద్వాసనా
జ్ఞానానన్దసుధామరన్దలహరీ సంవిత్ఫలాభ్యున్నతిః ॥ 47 ॥


సాధారణంగా వసంతకాలం రాగానే ఉద్యానవనములలో‌ ఎండుటాకులు రాలిపోతాయి. లతలు కొత్త చిగరులు ధరించి విస్తరిస్తాయి. మొగ్గలు తొడుగుతాయి. మొగ్గలు పూలై పూల సువాసనలు నలుదిశలా వ్యాపిస్తాయి. పూదేనె స్రవిస్తుంది. ఫలాలు పక్వానికి వస్తాయి.

శంకరులంటున్నారు - నా హృదయమనే ఉద్యానవనములో‌ శంభుని ధ్యానము అనే వసంతము రాగానే, పాపములనే ఎండుటాకులు రాలిపోతున్నాయి. భక్తిలతలు విలసిల్లుతున్నాయి. పుణ్యములనే చిగురుటాకులు మొలచినవి. గుణములనే మొగ్గలు తొడిగాయి. జప,తప పుష్పాలు పూచి సుసంస్కారాల సువాసనలు వెదజల్లుతున్నాయి. జ్ఞానానందమనే‌ మకరందం ప్రవహిస్తున్నది. సంవిత్తు (సమాధి, అనుభవం) అనే ఫలం వృద్ధి చెందుతున్నది.

నిత్యానన్దరసాలయం సురమునిస్వాన్తామ్బుజాతాశ్రయం
స్వచ్ఛం సద్ద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతమ్ ।
శంభుధ్యానసరోవరం వ్రజ మనో హంసావతంస స్థిరం
కిం క్షుద్రాశ్రయపల్వలభ్రమణసంజాతశ్రమం ప్రాప్స్యసి ॥ 48 ॥


హంసలు తమ నివాసముగా ఎటువంటి సరస్సులు కోరుకుంటాయి ? ఆ సరస్సులలో‌ జలములు శాశ్వతంగా ఉండాలి. జలములు స్వచ్ఛమైనవిగా ఉండాలి. పద్మములతో‌ నిండి ఉండాలి. సువాసనలు వెదజల్లుతూ‌ఉండాలి. గొప్ప హంసలు ఆ సరోవరమును నివాసముగా పొంది ఉండాలి. శంకరులు మన మనస్సులను హంసలతో‌ పోల్చి, ఆ హంసలకు పై లక్షణములున్న ఒక గొప్ప సరస్సును ఆశ్రయించమని ఉపదేశిస్తున్నారు.

ఓ మానస హంస రాజమా! స్థిరమైన శంభుధ్యానమనే సరోవరమును చేరుము. అది శాశ్వతానందమనే జలముతో‌ నిండినది. దేవతల,మునులయొక్క మనోకమలాలకు ఆశ్రయమైనది. నిర్మలమైనది. జ్ఞానులనే రాజహంసలచే సేవించబడుతున్నది. పాపములు హరించునట్టిది. సుసంస్కారములనే పరిమళములు వెదజల్లునట్టిది. (ఇంత గొప్ప సరోవరము ఉండగా) ఎందుకని అల్పులను ఆశ్రయించటం అనే బురదగుంటలలో తిరుగుతూ శ్రమ పడెదవు ?

ఆనన్దామృతపూరితా హరపదామ్భోజాలవాలోద్యతా
స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా ।
ఉచ్ఛైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మషా
నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మసంవర్ధితా ॥ 49 ॥


ఒక లత బాగా పెరిగి ఫలించాలంటే మనం ఏమేమి చెయ్యవలసి ఉంటుంది ? మంచి పాదుచూసుకొని, అందులో‌ పుష్కలంగా జలం నింపాలి. లత పెరగటానికి ఆశ్రయంగా ఒక కొయ్య పాతాలి. లత విస్తరించటానికి ఒక పందిరి వెయ్యాలి. లతను ఏ కల్మషమూ ఆశ్రయించకుండా చూడాలి. ఆ లతను పోషించాలి. అప్పుడు అది ఫలాన్నిస్తుంది. శంకరులు శివభక్తిని ఒక లతగా పోల్చి, ఆ భక్తి ఎలా ఉండాలో, అది ఎలాంటి ఫలాన్నివ్వగలదో‌ ఉద్బోధిస్తున్నారు.

నా భక్తిలత శివునిపై ప్రేమ అనే జలముతో పూరింపబడినది, హరుని పాదములనే పాదునుండి పుట్టినది, స్థిరత్వమనే‌ గుంజను పట్టుకున్నది. శాఖోపశాఖలుగా విస్తరించి, మనస్సనే ఎత్తైన పందిరిని ఆక్రమించినది. నిష్కల్మషమైనది. పుణ్యకర్మలతో‌ చక్కగా వృద్ధిపొందినది. అలాంటి నా భక్తిలత నిత్యము (శాశ్వతము) అయిన అభీష్టఫలము ఇచ్చునది అగుగాక.


సన్ధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థానాన్తరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితమ్ ।
భోగీన్ద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలిఙ్గం శివాలిఙ్గితం ॥ 50 ॥


శంకరులు తాను శ్రీశైలేశుని సేవిస్తున్నానని చెబుతూ, ఆ శ్రీశైలేశుడు ఎలాంటివాడో వర్ణిస్తున్నారు.

సంధ్యాసమయములలో విశేషముగా వ్యక్తమగువాడు, ఉపనిషత్తులయందు నెలవైయున్న వాడు (వేదాంతమందు చెప్పబడ్డవాడు), వాసుకి ఆభరణముగా కలవాడు, దేవతలచే పూజింపబడేవాడు, సద్భావనలచే శోభిల్లువాడూ, సద్గుణములచే తెలుసుకొనబడేవాడు, ప్రేమతో‌భ్రమరాంబాదేవి చేత కౌగిలించుకోబడినవాడూ అగు శ్ర్రీశైలేశుడు మల్లికార్జునస్వామిని నేను సేవించుచున్నాను.

శంకరులు అంతర్లీనంగా మరో అర్థమును కూడా చెప్పుతున్నారు (పరమాచార్యుల అమృతవాణిలో ...)

ఆంధ్రదేశంలో ఉన్న శ్రీశైలం ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రం అందలిస్వామి మల్లికార్జునుడు. మద్దిచెట్టును మల్లెతీగ అల్లుకొన్న విధంగా మల్లికార్జునస్వామి ఉన్నాడట. ఈశ్వరుడు స్థాణువు స్థాణువైన ఈశ్వరుణ్ణి సూచిస్తున్నది అర్జునవృక్షం లేదా మద్దిచెట్టు. భ్రమరాంబికయే మల్లెతీవ. శివశక్తుల సంయోగమంటే, మన మేధ ఈశ్వరుని శుద్ధతత్త్వంలో ఐక్యం కావటమే.

శ్రీశైలంలో మల్లికార్జునస్వామి వెలసి ఉన్నాడు. సంధ్యారంభంలో విజృంభించి తాండవం చేస్తున్నాడు. శ్రుతి శిరస్థానములని పేరుపడ్డ ఉపనిషత్తులలో వాసం చేస్తున్నాడు. భ్రమరాంబికా యుక్తుడై, ఆనందమూర్తియై, ముముక్షు హృదయవాటికలలో పరవశుడై తాండవం చేస్తున్నాడు. అట్టి శివాలింగినమైనమల్లికార్జునమహాలింగమూర్తినిసేవిస్తున్నాను - అని భగవత్పాదులవారు అంటున్నారు.

ఈ శ్లోకంలో గమనింపదగిన కావ్యాలంకారం ఒకటి ఉన్నది. సంధ్యారంభంలో తాండవంచేసే పరశివుని జటాజూటం విప్పుకొన్నట్లే మల్లెలూ, సాయంతసమయంలో పరిపూర్ణంగా వికసిస్తాయి. ఈశ్వరునికి శ్రుతిశిరస్థానాలు వాసమైతే, మల్లెలు నారీశిరస్థానాలను ఆక్రమించుకొంటున్నవి. భ్రమరాంబిక ఈశ్వరాన్వేషణం చేస్తే, భ్రమరములు మల్లెలను అన్వేషిస్తున్నవి. ఈశ్వరునికున్న సద్వాసన మల్లెలకున్నూ కద్దు. భోగీంద్రుడు అనగా సర్పం-శంకరునికి ఆభరణం. భోగీంద్రులకు మల్లెలు అలంకారాలు. ఈశ్వరుడు సుమనస్కులలో-దేవతలలోపూజ్యుడు. సుమనస్సులలో అనగా పుష్పములలో మల్లెలకు ఒక విశేషస్థానం. ఈశ్వరుడు గుణావిష్కృతుడు, అనగా శుద్ధసత్త్వ గుణము కలవాడు. మల్లెలూ గుణావిష్కృతములై అనగా దారములో గ్రువ్వబడి, అందాన్నీ సౌరభాన్నీ వెదజల్లుతూ ఉంటై. ఈశ్వరుడే ఒక్క పెద్ద బొండుమల్లె!

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.