Monday 31 October 2016

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 51 - 55



శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 51 - 55

భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా-
హ్లాదో నాదయుతో మహా(ఽ)సితవపుః పఞ్చేషుణా చాదృతః ।
సత్పక్షః సుమనో(ఽ)వనేషు స పునః సాక్షాన్మదీయే మనో-
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు: ॥ 51 ॥


శంకరులు శ్రీశైలేశుడైన శివుడు ఒక గండుతుమ్మెద అని చెబుతూ, ఆ తుమ్మెదను తన మనస్సు అనే పద్మములో‌ విహరించమని పిలుస్తున్నారు. శివునికి తుమ్మెద లక్షణాలను శంకరులు ఎలా ఆపాదించారో చూడండి.

గండుతుమ్మెద భృంగి (ఆడుతుమ్మెద) ఇచ్ఛానుసారముగా నాట్యముచేయునది. గజముయొక్క మదజలము గ్రహించునది. మాధవమాసము వలన (వసంతములోని వైశాఖము) ఆనందము పొందునది. ఝంకారనాదము కలిగినది. అసితవపుః - మహా నల్లని శరీరం కలది. మన్మధుడిచే తనకుసహాయముగా (తుమ్మెదలు మన్మధుని వింటినారి) నిశ్చయించబడినది. పూదోటలయందు ఆసక్తి ఉన్నది.

శివుడు భృంగి ఇచ్ఛానుసారముగా తాండవము చేయువాడు. గజాసురుని పీచమణచినవాడు. నారాయణుని వలన (మోహినీరూపములో) ఆనందమునొందినవాడు. ప్రణవనాదయుతుడు. సితవపుః - మహా తెల్లని శరీరం కలవాడు. మన్మధుడిచే తనలక్ష్యముగా నిశ్చయించబడినవాడు. సజ్జనులను రక్షించుటయందు ఆసక్తి కలవాడు.

ఆ శ్రీశైలేశుడు, భ్రమరాంబా పతి, పరమేశ్వరుడు అయిన గండుతుమ్మెద నా మనస్సనే కమలములో‌ విహరించుగాక!


కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్ఛిదాకర్మఠం
విద్యాసస్యఫలోదయాయ సుమనఃసంసేవ్యమిచ్ఛాకృతిమ్ ।
నృత్యద్భక్తమయూరమద్రినిలయం చఞ్చజ్జటామణ్డలం
శంభో వాఞ్ఛతి నీలకన్ధర సదా త్వాం మే మనశ్చాతకః ॥ 52 ॥


శంకరులు శంభుడిని ఒక నీలి మేఘముతో‌ పోలుస్తూ, తన మనస్సనే చాతక పక్షి ఆ శంభుడనే‌ మేఘమును ఎప్పుడూ‌ కోరుకుంటున్నది అంటున్నారు.

నీలకంఠుడా ! కారుణ్యామృతవర్షము కురిపించువాడవూ, గ్రీష్మమనే గొప్ప ఆపదను పోగొట్టగలవాడవూ, సజ్జనులచేత (దేవతలచేత) విద్య అనే పంట పండుటకై ప్రార్థించబడువాడవూ, ఇష్టం వచ్చిన రూపము ధరించుచున్నవాడవూ, భక్తులనే మయూరములను నర్తింపజేయుచున్నవాడవూ, కొండపైనున్న వాడవూ, శోభించు జటాజూటము కలవాడవూ‌ అయిన ఓ శంభో ! (జలధరమైన మేఘము వంటి)‌ నిన్ను నా మనస్సనే‌ చాతకపక్షి ఎప్పుడూ‌ కోరుకుంటున్నది.



ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతా-
ఽనుగ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే ।
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటన్తం ముదా
వేదాన్తోపవనే విహారరసికం తం నీలకణ్ఠం భజే ॥ 53 ॥


ఆకాశము అనే పింఛముకలదీ, సర్పములరాజు వాసుకి అలంకారముగా కలదీ, నమస్కరించువారిని అనుగ్రహించు ప్రణవనాద ధ్వనులనే కేక కలిగినదీ (నెమలి అరుపులకి కేక అను పేరు), పర్వతరాజపుత్రి పార్వతి అను గొప్పకాంతిగల నల్లమేఘమును చూచి ముదమునొంది నాట్యము చేయునదీ, ఉపనిషత్తులనెడు ఉద్యానవనములో‌ విహరించుటయందు అనురాగము కలదీ‌ అగు ఆ (శివుడు అనబడే) నెమలిని సేవించున్నాను.

వ్యోమకేశుడూ, సర్పభూషణుడూ, భక్తులను ప్రణవోపదేశముతో‌ అనుగ్రహించువాడూ, పార్వతీ‌వల్లభుడూ, వేదాన్తవేద్యుడూ అయిన శివుని నమస్కరించుచున్నాను.

సన్ధ్యాఘర్మదినాత్యయో హరికరాఘాతప్రభూతానక-
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చఞ్చలా ।
భక్తానాం పరితోషబాష్పవితతిర్వృష్టిర్మయూరీ శివా
యస్మిన్నుజ్జ్వలతాణ్డవం విజయతే తం నీలకణ్ఠం భజే ॥ 54 ॥


శివుడు మయూరమని చెప్పిన శంకరులు, ఆ మయూరనాట్యము జరుగు పరిస్థితులు ఏవో చెప్పుతున్నారు. ఇది శివుని ప్రదోషతాండవ చిత్రణము.

సంధ్యా సమయమే శరదాగమనము (శరదృతువు). ఆనకమనే వాయిద్యమును విష్ణుమూర్తి తన కరములతో‌ మ్రోగించగా వచ్చిన ధ్వనులే మేఘగర్జనలు. దేవతల దృష్టి పరంపరలే మెరుపులు. భక్తుల ఆనందాశ్రువుల ధారలే వృష్టి. పార్వతీదేవియే‌ ఆడునెమలి. ఇలా మహోజ్వలంగా నాట్యము చేయు (శివుడనే ) నెమలిని సేవించుచున్నాను.


ఆద్యాయామితతేజసే శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయ తే
విద్యానన్దమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ।
ధ్యేయాయాఖిలయోగిభిః సురగణైర్గేయాయ మాయావినే
సమ్యక్తాణ్డవసంభ్రమాయ జటినే సేయం నతి శ్శమ్భవే ॥ 55 ॥

ఆదిదేవుడూ, జ్యోతిస్వరూపుడూ, వేదవాక్యములచేత తెలియబడేవాడూ, పొందదగినవాడూ, చిదానందమయమైన ఆత్మస్వరూపుడూ, ముల్లోకాలనూ‌ రక్షించువాడూ, సమస్త యోగులచేతనూ‌ ధ్యానింపదగువాడూ, సురగణములచేత కీర్తింపబడేవాడూ, మాయాశక్తియుతుడూ, చక్కని తాండవముచేయుచూ‌ ఆనందించువాడూ, జటాధారీ అగు శంభునకు ఇదే‌ నమస్కారము.






ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.