Monday, 23 May 2016

సంగ్రహ ధర్మ విషయములు - దంతధావనం

సంగ్రహ ధర్మ విషయములు
దంతధావనం

ఉదితే భాస్కరే యశ్చ కరోతి దంతధావనమ్|
సవితా భక్షిత స్తేన పితృవంశస్య ఘాతకః||

సూర్యుడు ఉదయించకముందే పళ్ళు తోముకోవాలి. ముందుగా బాగా పుక్కిలించి ఉమ్మి వేయాలి.

ప్రాఙ్ముఖోదఙ్ముఖో వాపి ద్వి రాచమ్య తతఃపరమ్|
ఉక్తకాష్ఠేన కుర్వీత వాగ్యతో దంతధావనమ్||

తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చుని రెండుసార్లు ఆచమనం చేసి ,మౌనంగా దంతధావనం చేసుకోవాలి.

బాహూ జాన్వంతరం కృత్వా కుక్కుటాసన సంస్థితః|
తర్పణాచమనోల్లేఖ్య దంతధావన మాచరేత్||

గొంతుకకు కూర్చుని చేతులురెండూ మోకాళ్ళమధ్యలో ఉంచుకుని {దీనినే కుక్కుటాసనం అంటారు.} ఆచమనం చేసి, అలాగే దంతధావనం చేసుకోవాలి.

ప్రక్షాళ్య హస్తౌ పాదౌ చ ముఖం సుసమాహితః |
దక్షిణం బాహు ముద్ధృత్య కృత్వా జాన్వంతరా తతః||

చేతులు, కాళ్ళు , ముఖము శ్రద్ధగా కడుక్కోవాలి. కూర్చుని, రెండు మోకాళ్ల మధ్య నుంచి కుడి చేతితోపళ్ళు తోముకోవాలి.

మూత్రే రేతసి విట్సర్గే దంతధావన కర్మణి|
భక్ష్యాణాం భక్ష్యణే చైవ క్రమా ద్గండూష మాచరేత్||

మల విసర్జన తరువాత 8 సార్లు , మూత్ర విసర్జన తరువాత4 సార్లు , పళ్ళు తోముకునేటప్పుడు , అన్నం మొదలైనవి తిన్న తరువాత 12సార్లు పుక్కిలించాలి .

పురత  స్సర్వదేవా శ్చ దక్షిణే పితర స్తథా|
ఋషయః పృష్ఠత స్సర్వే వామే గండూష ముత్సృజేత్||

తనకు ఎదుట దేవతలు , కుడి ప్రక్కన పితృ దేవతలు , వెనుక ఋషులు ఉంటారు . కాబట్టి పుక్కిలించిన నీళ్ళువగైరా ఎడమ వైపు  ఉమ్మి వేయాలి.

గండూష స్యాథ సమయే తర్జన్యా వక్త్రచాలనమ్|
కరోతి యది మూఢాత్మా రౌరవం నరకం వ్రజేత్||

పుక్కిలించేటప్పుడు{దంతధావనం వగైర సందర్భాలలోనూ}పళ్ళుతోమటం వంటి పనులు చూపుడు వేలితో చేయగూడదు .

ప్రభాతే మైథునే చైవ ప్రస్రావే దంతధావనే|
స్నానేచ భోజనే కాలే మౌనం షట్సు విధీయతే||

సూర్యోదయ సమయములోనూ, మల మూత్రవిసర్జనం సమయములోను, పళ్ళు తోముకొనేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి.

దూరా దవసధా న్మూత్రం పురీషం చ  సమాచరేత్|
గచ్ఛం స్తిష్ఠం చ విష్ఠాం చ మలమూత్రం చ నోత్సృజేత్||

మలమూత్ర విసర్జన ఇంటికి దూరంగా చేయాలి . నడూస్తూ గాని , నిలుచుండి గాని మలమూత్ర విసర్జన చేయగూడదు.

పవిత్రం చ దక్షిణే కర్ణే కృత్వా విణ్మూత్ర ముత్సృజేత్|
మలమూత్రవిసర్జన  సమయంలో యజ్ఞోపవీతాన్ని కుడిచెవికి తగిలించుకోవాలి.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.