Friday 30 December 2016

రామాయణము, అంతరార్థము: ఉపోద్ఘాతం


రామాయణము, అంతరార్థము: ఉపోద్ఘాతం
బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారి ఉపన్యాసముల నుండి.
@రామాయణప్రభ,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారు రామాయణంలోని అంతరార్థాన్ని ఆవిష్కరిస్తూ, నలుడి కథ ద్వారా అంతరార్థమును తెలుసుకోడం చెప్పుతున్నారు.

మానవుని మనస్సు నాదమునందు సులభముగ లయమగుచున్నది. అనగా వృత్తిరహితమైన బ్రహ్మానందమును పొందుచున్నదని యర్థము. పరమాత్మ స్వరూపము బ్రహ్మానంద పర్యవసాయి అయినను లీలాస్వీకృత విగ్రహుడైన విష్ణువు బ్రహ్మమయుడై యుండియు లోకవ్యవహారము సాగించుచు, తన వ్యవహార సమయమున బ్రహ్మరూపమునుండి చ్యుతుడు గాక అచ్యుతుడై వెలయుచున్నాడు. విష్ణువు సహజమైన బ్రహ్మభావము నుండి చ్యుతుడు కాడు కావుననే అచ్యుతుడని పిలువబడుచున్నాడు. శ్రీరామునకు 11 వేల సంవత్సరములలో ఒక్కేసారి దేహాభిమానము కలిగినదట. మారీచుని సంహరించివచ్చి పాడుబడిన పర్ణశాల జూచి శరీరాభిమానముతో ఓకైక? ఓ తల్లి ! నీ కోరిక నెరవేరినదని విలపించెను. ఇట్టి తిట్టు కైక నెప్పుడు తిట్టలేదు. కావున నిచ్చట రామునకు మానుషాభిమానము కలిగినదని వృద్థసంవాదము కలదు. ఆగస్త్యుడు రాముని - రావణుడు సీతను తల్లివలె రక్షించె (మాతేవ పరిరక్షితా) నని యుండగా నేల సంహరించితివని ప్రశ్నించెనట. అసలు రావణుడు - రాముని చేతి యందు మరణము కోరియే సీతను దీసికొనిపోయెను గాని కామముతో గాదని పెద్దల వాదము. కాన రావణుడు తెలిసిన మూర్ఖుడనబడుచున్నాడు. దుర్యోధనుడు మాత్రము తెలియని మూర్ఖుడగుచున్నాడు. రావణుడు సీత నపహరించు సందర్భము లోకమున పరిపరివిధములుగ నున్నది. అసలు సీతయే యని కొందరు, కొందరు అసలు సీత కాదనియు, మాయాసీత యనియు తెల్పుచున్నారు. ఈ మాయాసీతయే అగ్నియందుండి ద్వాపర యుగమున ద్రౌపదియై అగ్నినుండి జన్మించెనని దేవిభాగవతమున గలదు వాల్మీకమున మాయాసీత యెక్కడ లేదని కొందరు పండితులు వాదించుచున్నారు వాల్మీకము నాదికావ్యమని వ్యవహరింతురు. కావ్యము వ్యంగ్య ప్రధానమని లక్షణము గదా! ''జీవితం వ్యంగ్యవైభవం'' ఆ వ్యంగ్యము నెల్లరు కనుగొన లేరనియే దానిలోని వ్యంగ్యమంతయు ఆధ్యాత్మ రామాయణముగా వ్రాయబడినదని పెద్దలు అనుచున్నారు. అధవా వాల్మీకము వ్యంగ్యకావ్యము కాదనినను దానినిబట్టి మాయాసీత లేకున్నను ఆధ్యాత్మరామాయణమునుబట్టి, దేవీభాగవతాది గ్రంథములనుబట్టి, లౌకిక ప్రవాదమునుబట్టి మాయాసీత వ్యవహారములో లేకపోలేదు అంతరార్థమును ఆలోచించినచో రావణాసురుడు దేవీ అనుగ్రహము కొఱకు సీత నెత్తుకొని పోయెనని చెప్పవలయును. దీనికి రామాయణములోనే సనత్కుమార రావణసంవాద, కపిలముని సందన్శనములు నిదర్శనములు. దహరాకాశములోని బ్రహ్మతో మాయలీనమై యున్నది. లంకయనగా శరీరము క్రిందిభాగము. అందునున్న తెలివియే మాయాసీత, అది నాగలిచాలువలె చక్రముద్వారా వ్యాపించియున్నదని యోగము. వాయుజుడు (హనుమంతుడు) దేవీతత్త్వమును వెదకుచున్నాడు సీత హనుమంతునితో భాషించుచు రామునకు ఎక్కడ వలసిన నక్కడనే సీత యున్నదని పల్కెను. అనగా రావణుడు తెచ్చిన సీత మాయాసీత యని తెలియుచున్నది. రావణుడు తెచ్చునపుడు అసలుసీత అగ్నులయందు లీనమైయుండెనట. దీనిలో వాది దౌర్బల్యమేగాని వాదదౌర్బల్యము లేదు. ప్రాసంగిక మాకథ యిట్టులుండ ప్రస్తుత మనుసరింతము

మనస్సునకు వృత్తియందే ప్రపంచము వచ్చినది. వృత్తి లయమైనచో ప్రపంచము లేదు. అది నాదమునందు సులభముగ లయము నొందును. అని శంకరులు భాషించిరి. కాని యేది యెట్లున్నను అవతార పురుషులకు కష్టసుఖము లనునవి లేవు. మనము గ్రంథములందు చదువునది యెల్ల వ్యావహారికలోకమునకు మాత్రమే యగుచున్నది. కావ్యములు వ్యంగ్యప్రధానముగ, కాంతాసమ్మితములై అలరారుచున్నవి. వేదములు ప్రభుసమ్మితములు, పురాణములు మిత్రసమ్మితములు. ఇక కావ్యము వ్యంగ్యప్రధానమంటిని గనుక ఇందు వాచ్యార్థముకాక వ్యంగ్యార్థము స్ఫురించుచున్నది. శ్రీహర్షుని నైషధమునకు వ్యంగ్య వైభవములో వేదాంతపరమైన అర్థము గ్రంథమంతట తోచుచున్నది. కాని మనవారు ''కావ్యాలా పాంశ్చవర్జయేత్‌'' - అను వాక్యప్రమాణమున కావ్యముల చదువరాదని నిషేధించిరి. అయినను కావ్యములందు వర్ణించిన మంచి విషయమును గ్రహించి చెడును విసర్జించవలయుననియే పై వాక్యార్థముగ సమన్వయించి చూడవలయును ''సత్కావ్యకృత్యాద్యవసే చరంచ సమీర సేకాది వదీరయంత్యేత్యాది వాక్యములును కావ్యములవలన కర్తవ్యత్వబుద్ధి నిశ్చయమగుచుండును చమత్కారిత్వమందు నుండుటవలన మనము నాకర్షించును గాన నిట్టి కావ్యములకా నిషేధము తగులదు. అట్లు తగిలిన వాల్మీకమును కావ్యమేగదా?

ఇక శ్రీహర్షుడు తన కావ్యమగు నైషధమును వ్యంగ్యవైభవ విలసితముగ వెలయించె నంటిమి. ఈవ్యంగ్యమనునది పదైక దేశమని వర్ణగతమని అనేకవిధములుగ నుండును. అంతియగాక ప్రబంధగతమని వాక్యగతమని గలదు శ్రీ హర్షుడు తన కావ్యమును ప్రబంధగత వ్యంగ్యముగా రచించెను. ఇందు ప్రతిశ్లోకము వేదాంతార్థమును స్ఫురింపజేయును. రలయో రభేదః - అను సూత్రప్రమాణముచే నల శబ్దమునశు నర అని అర్థము చెప్పవచ్చును. నరుడనగా నశింపనివాడని యర్థము క్షయించు స్వభావముగల శరీరమును కాపాడువాడని భావము. కాబట్టి శరీరాధికారి నరుడు అగుచున్నాడు ఈభావము నాతడు మొదటి శ్లోకమునందే పొందుపరచెను. క్షితి రక్షిణః కధాః - క్షితి అన నశించునది శరీరము. దాని రక్షించువాడు నరుడు. అతడు మహోజ్జ్వలమగు తేజోరాశి. సితచ్ఛత్రిత కీర్తిమండలుడు అని మొదటి శ్లోకమున నామరూప రహితః పరమాత్మా - అని వస్తునిర్దేశముచేసి రెండవ శ్లోకమున దీనిని వివరించెను. శ్రీకృష్ణుడు గీతయందు - యశ్చంద్రమసి యచ్చాగ్నౌతత్తేజో విద్ధిమామకం - అని చంద్రునియందలి అగ్ని యందలి తేజము నాయదిగా తెలిసికొనుమని చెప్పెను. కాని సూర్యమండలము సంగతి చెప్పలేదు. దాని కర్థము చంద్రమండలము సహస్రారము. అగ్నిమండలము నాభిస్థానము ఈ రెంటియందు వ్యాపించిన తేజము డహరాకాశగతమగు సూర్యతేజము తనదిగా నివ్చయించి నుడివెను. నైషధమునందలి - రసైః కధామస్య సుధావధీరిణీ నలస్స భూజాని రభూత్‌ గుణాద్భుతః ..... అను శ్లోకమున ఎవరికథ రసములతో సుధను తిరస్కరించునదియో ఆ నలుడు భూమిజాయగా గలవాడై గుణాద్భుతు డాయెను అని నిర్గుణమును సగుణముచేసి వర్ణన మొదలిడెను. వేదాంతపరముగ పరమాత్ముని కథయని మరియొక అర్థము. మరియు -

సువర్ణ దండైక సితాత పత్రితజ్జ్వల త్ప్రతాపావళి కీర్తి మండలః - మొదటి శ్లోకమున సితాతపత్రమును మాత్రమే చెప్పి రెండవ శ్లోకమున దానికి సువర్ణ దండత్వమునుగూడ సంపాదించెను. ఈ శ్లోకము వలన బంగారపు కఱ్ఱపై భాగమునగల తెల్లని గొడుగు కలవాడు నలుడని భావము. సహస్రారమునందలి పరమాత్మ స్ఫురణ మరియొక అర్థముగా తోచును. ఇట్లు ప్రతి శ్లోకమునకు వేదాంతార్థము చెప్పి తీరవలయును - ఇందలి దమయంతి విద్యాశక్తి యని ఇదివరకే చెప్పబడినది.

ఒకనాడు నలుడు వనవిహారమునకై వెళ్ళెను. శరీరమే ఉద్యానవనము. అందలి నాడులే వృక్షములు. ఆ ఉద్యానము నందొక సరస్సు. అదియే ఐరంమదీయ సరస్సు. అందు బంగారు రెక్కలుగల హంస ఒంటి కాలిమీద నిలబడి నిద్రబోవుచున్నది. మన శరీరమునందలి హంస కూడ నిద్రించుచునే యుండును. ఈ హంసను జాగ్రత్తగా పట్టుకొనవలసి యున్నది. నలుడా హంసను బట్టుకొనగా నది యాతని చాల బాధపెట్టెను. తనను వదలుమని సామోక్తులతో పలికెను. చివరకు విడిపించుకొనలేక దుఃఖించెను.

'మదేశపుత్రా జననీ జరాతురా'' ఇత్యాదిగా నెంతయో ప్రాదేయపడినది. ఇదియంతయు మొదట హంసవిరోధము చేసినవాని సాంసారిక విద్యుతివలని బాధ. పరమార్థమునకై పాటుపడుచుండగా సంసార తాపత్రయము హెచ్చినట్లు హంస యెంతయో బ్రతిమాలెను. కాని లాభములేక రాజుచేతిలో సొమ్మసిల్లెను. ఇట్లు ఆ హంస నలునకు స్వాధీనమైనది. రాజు తర్వాత దీనదయాళు డగుటవలన నిన్ను చంపుటకు బట్టలేదు. కాని నీ రూపము చూచి యానందించుటకే పట్టుకొంటిని రూపము చూచు పని నెరవేరినది గాన నిక నీవు యధేచ్ఛగా బొమ్మని వదలెను. కాబట్టి బ్రహ్మ సాక్షాత్కారమైన పిమ్మట హంస ఉచ్చ్వాస నిశ్వాసములు) ఎట్లు పోయిన నేమి? ప్రాణాయామాదిక మనవసరము. కాని రాజును వదలి పోయిన హంస మరలవచ్చి అతని భుజముపై వ్రాలినది. అనగా యోగాభ్యాసపరులకు నిర్ణీతకాలమున యోగసమాధి దాని యంతతానె ఆవహింప గలదని భావము. వచ్చిన హంస రాజున కొక సందేశమిచ్చినది. ఇది హంస దౌత్యము అనగా నీహంసయే జ్ఞానమును, విద్యను ప్రకాశింపచేయునదని భావము. కథయందు దమయంతి తండ్రి భీమరాజు అనగా నియమమని భావము. వీనికే దమయంతీ రూపమైన విద్యాశక్తి పుట్టినది. ఇక దమయంతి స్వయంవరమునకు దేవతలుకూడ వచ్చినట్లు కలదు. దేవతలు కథలో కామముతో వచ్చినట్లుండిరి కాని ఆంతర్యమున - దేవతలు నల దమయంతులకు సంబంధము కలిగించుటకు వచ్చిరి. పైకి వారు స్వార్ధమును జూపు చున్నట్లున్నను ఆంతర్యమున పరోక్షప్రియులు దేవతలు. కాబట్టి నలుని ఇష్టాపూర్తములకు సంతసించి భూమియందే స్వర్గసౌఖ్యము నాతనికి కావించుటకే దేవతలు వచ్చినట్లు ఊహింపవలయును కావున దమయంతిని వివాహమాడుటకు దేవతలు రాలేదు. అదియును గాక వారు దమయంతి నలుని గుణగణములను విని చూచి వరింపకున్న వట్టి మొద్దుకనక అట్టి అవివేకి మనకు వద్దనియు భావించిరట. మరియు దమయంతి నలునే వరించినచో పరదారపై ప్రణయము మనకేల? అని భావించిరట. కావున దేవతలకు దమయంతిపై నిజమైన ప్రేమలేదనుట తెలియవలెను. మొత్తముమీద స్వయంవరము నాడు నల్వురు దేవతలు నలరూపధారులై రాగా భీమరాజు ప్రార్థనపై సరస్వతియే స్వయముగా వచ్చి దమయంతికి నలుని చూపి చెప్పినది. ఇందు సరస్వతి ఆయా దేవతలగూర్చి చెప్పుచు సర్వదేవతారూపుడు నలుడని ప్రశంసించి బహు చాకచక్యముగా నిరూపించి చూపినది. అయినను దమయంతి నలుని నిజరూప మెఱుగక ఒప్పుకొనలేదు. చివరకు దేవతలను ప్రార్థించి వారు ప్రసన్నులుకాగా నిజమైన నలుని వరించినది.

ఈ విధముగా విద్యాశక్తికి ఆత్మతో సంబంధము వర్ణింపబడినది. వచ్చిన దేవతలు నలదమయంతులకు వరములిచ్చి పోయిరి ఇంద్రాగ్ని యమవరుణులచే నలుడు గొప్ప వరముల నొందెను. కావున శ్రీహర్షుని నైషధము ప్రబంధగత వ్యంగ్యమునకు చక్కని యుదాహరణముగ గైకొన వచ్చును.

శ్రీ హర్షుడు తర్కమున గొప్పవాడు. ఒకప్పుడు శంకరులతో వాదించి చార్వాక మతమును స్థాపించెను. అట్టియెడ శంకరులు వానియుక్తి చాతుర్యమునకు మెచ్చుకొని మాటాడక మిన్నకుండెను. కాని శ్రీహర్షుడు భోజనమునకు కూర్చుండగా అన్నము పురుగులవలె కన్పింపసాగెను. అపుడు శ్రీహర్షుడు తల్లితో శంకరులతోడి తన వాదమును, తత్ఫలితమును గూర్చి చెప్పెను. ఆమె వెంటనే శంకరుల పాదములపైబడి పుత్రభిక్ష నర్థింపగా శంకరులు నేనేమియు ప్రయోగము చేయలేదని సమాధానమిచ్చెను. మరియు శ్రీహర్షుని వాదమునకు మాత్రము తన మనస్సు బాధ నొందినదనియు చెప్పెను. బ్రహ్మజ్ఞానియై ఆస్తికుడైన వాని మనస్సుకు బాధ నొందించిన వాడు ఏడురోజులలో స్వయముగా నశించునని శాస్త్రము నందు గలదు. ఇట్లే రావణయుద్ధము ఏడు రోజులతోనె ముగిసినదికదా! శ్రీహర్షుడు మరునాడుదయమున స్నానముచేసి, విభూతి పూసికొని శంకరుల దగ్గరకు వెళ్ళి మరల దేవుడు కలడని వాదించెను. ఇట్లు తన తర్కవాదముతో వేదముల కన్యార్థము కల్పించి శంకరుల వాదమును శ్రీహర్షుడు పరాస్తము కావించి పలుబాధలకు గురియయ్యెను. కానపరిహాసమునకైనను నాస్తికవాదము గ్రహింపరాదు.

ఇట్లే రామాయణమునకు కూడ వ్యంగ్యార్థము గ్రహింపవచ్చును. ఉత్తరకాండయందు అగస్త్యుడు రాముని-సీతను తల్లివలె చూచిన రావణు నేల చంపితివని ప్రశ్నించెను. ఇచట ఒక సందేహము పొడగట్టుచున్నది. నలకూబరుని వలన రావణునకు ఇష్టము కాని స్త్రీని ముట్టరాదని, ముట్టినచో తల పగులుననియు శాపము గలదు. ఈ విషయమును నారదుడు బ్రహ్మతో చెప్పగా బ్రహ్మయు తథాస్తని దీవించెను. కాని రావణుడు సీతను మెడను తొడనుబట్టి తీసికొని వెళ్ళినట్లు రామాయణమున గలదు. కాని ఆతని తల పగులలేదు. కారణ మాతడు సీతను మాతృభావముతో ముట్టుకొనెను గాన అని తెలియవలెను. ఒకానొకప్పుడు రావణుడు సనత్కుమారుని దగ్గరకు పోయి విష్ణువు యొక్క గొప్పతనమును గూర్చి చెప్పుమనెను. అంత సనత్కుమారుడు ఆతని గౌరవించి విష్ణువు యొక్క గొప్పతనమును గూర్చి, ఆతని చేతిలో చచ్చుట పుణ్యమని బోధించెను. అంత రావణుడు అట్లు విష్ణువుచేత చచ్చు వున్నెము నాకు గలదా? అని మనసులోపల దలచెను, సనత్కుమారుడు విష్ణువు రాముడై దశరథుని గర్భమున జన్మించి నిన్ను చంపుననెను, నాటినుండి రావణుడు రాముని రాకకు నిరీక్షించుచుండెను. అంతియగాదు ఇక్ష్వాకు వంశీయుల నందఱను సంతానవంతుల మాత్రమే యుద్ధమున నిహతుల కావించుచుండెను. ఇక్ష్వాకు వంశ నాశనము చేయుటకు ఇష్టపడలేదు. మరియు దశరథ కౌసల్యలకు రాముడు పుట్టునని తెలిసి వారిని రావణుడు పెట్టెయందు బంధించి యుంచెను. కాని ఆ పెట్టెను ముసలి ఎత్తుకొనిపోయెను. అని యేదో ఒక గాధ అన్యపురాణాంతర్గతము కలదు. ఆ కౌసల్యా దశరథులు మరొకరు అని తెలిసికొనవలెను. తర్వాతనే ఈ దశరథునకు కౌసల్యకు రాముడు జన్మించెను. దశరథుని పరాక్రమమును రావణుడు మొదటినుండియు పరీక్షించుచుండెను. 12 ఏళ్ళకే దశరథుడు రాజర్షియై సింహాసన మెక్కెను. నాడు లోకమున నొక నియమము గలదు. 12 పర్యాయముల కొక్కసారి శనైశ్చరుడు రోహిణిని భేదించును. అప్పుడు కఱవుకాటకములు లోకమున నేర్పడును. దశరథుడు అది తప్పించుటకై ప్రయత్నము చేయనెంచెను. కాని వశిష్టుడు లాభము లేదనెను. అయినను దశరథుడు ఖగోళమున యుద్ధము చేయుటకు నిశ్చయించి సుమంత్రుని రధమాయితము చేయుమని ఆజ్ఞానించెను. 400 గుఱ్ఱములు పూన్చిన నూరు రధములపై యుద్ధమునకు తరలెను. కాన శతరథుడు వాడు యుద్ధమునకు పోవుచు వశిష్టుని సెలవడుగగా నాతడు విజయమగునని కమండలూదకము రధముపై జల్లి దీవించెను. యుద్ధమున శనికి ఎదురుగా రథము నిల్పి రోహిణిపైకి పోకుండ నిరోధించెను. శని దశరధుని నూరు రధములలో 90 రధముల విఱుగగొట్టెను. పది రధములు మాత్రము మిగులుటచే దశరధుడని పేరు వచ్చెను. అపుడు దశరధుడు బ్రహ్మచర్యమున నున్నాడు గాన దీక్షతో బ్రహ్మశిరోనామకాస్త్రమును లోకోపకారమునకై శనిపై ప్రయోగించెను. అంత శని శరణు వేడెను.

అంతియగాక దశరధుని రాజ్యపాలన పర్యంతము రోహిణిని భేదింపనని పల్కెను. ఇట్లు దశరధుడు అజేయుడై ఖగోళముతో యుద్ధ మొనరించెను. అరువదివేల యేండ్లు రాజ్యము నేలెను. ఇట్టి దశరధ పరాక్రమము చూచి, వీనికి తప్పక రాముడు పుట్టగలడని భావించి, ఆతనితో యుద్ధము చేయక, రాముని రాకకై రావణుడు నిరంతరము నిరీక్షించుచుండెను. కానిచో రామజన్మమునకుగా దశరథు డొనర్చిన అశ్వమేధము నందలి గుఱ్ఱమును రావణుడుగాని వాని తరపున మరొక్కడుగాని పట్టుకొనకుండ నేల వదలిరి? పిలువని పేరంటమునకు పోవు రావణుడు పిలుపుగల మేధ్యాశ్వ విషయమగు యుద్ధమును వదలుట ఆలోచింపదగిన విషయము గదా! ఇదంతయు ధ్వని వైభవము.

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/12/blog-post_30.html

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.