Sunday 4 December 2016

పరమాచార్యుల అమృతవాణి : స్కంద వైభవము



పరమాచార్యుల అమృతవాణి : స్కంద వైభవము
(జగద్గురుబోధల నుండి)

@ శంకరవాణి

సంస్కృతంలో నామలింగానుశాసనం చేసే గ్రంథం ఒకటి ఉన్నది. దాని పేరు అమరకోశం. అది సంస్కృత నిఘంటువు. సంస్కృతాన్ని ఇపుడు మృతభాష అని అంటున్నారు. కానీ మనవాళ్లంతా సంస్కృతాన్ని దేవభాష - అమరులభాష అనియే వ్వవహారించారు. ఆ సంస్కృతభాష యొక్క కోశమును అమరకోశముని పేరు. సంస్కృతభాషకు అమరభాష ఐన దాని వలన ఈపేరు దానికి రాలేదు. గ్రంథకర్తపేర అమరసింహుడు అగుటచేత ఆయన వ్రాసిన గ్రంథానికి అమరకోశమని పేరు వచ్చింది. అమరసింహుడు జైనుడు. అతడు ఆచార్యులవారితో వాదానికిదిగి ఓడిపోయాడు. ఆ అవమానం భరించలేక తాను వ్రాసిన గ్రంథములను తగులబెట్టడానికి పూనుకొన్నాడు. ఆచార్యులవారికి ఇది తెలియవచ్చి అతడు చేస్తున్న పనికి అడ్డుతగిలారు. కడపటకు మిగిలినది ఒక్క పుస్తకం. అదే అమరకోశం.

స్వామి అన్నపదం పొదుపుగా అన్నిదేవతలకూ అనువర్తించినా అది ప్రముఖంగా సుబ్రహ్మణ్యస్వామికే అనువర్తిస్తుంది. వెంకటరమణస్వామి, నృసింహస్వామి అని ప్రతి దేవతా విశేషమునకు స్వామి అన్నపదం చేర్చి చెప్పుతుంటాము. ఊరక స్వామి అని అంటే - అస్వామి అన్నపదం సుబ్రహ్మణ్యమునే సూచిస్తుంది - దీనికి ఆధారం కావాలంటే అమరకోశం చూడవచ్చును. అందులో - ''దేవసేనాపతిః శూరః స్వామీ గజముఖానుజః'' అని సుబ్రహ్మణ్యస్వామిని గూర్చి చెప్పిన పదములలో 'స్వామి' పదం వాడబడియున్నది.

స్వామిపదం సుబ్రహ్మణ్యమునే సూచిస్తుందని అనడానికి మరొక ఆధారంకూడా వున్నది.

తిరుపతిక్షేత్రం సుబ్రహ్మణ్యునికి సంబంధించినదని చెప్పుకోవటం మీరు వినేవుంటారు. వెంకటరమణుడు సుబ్రహ్మణ్యుడే అని విశ్వసించే వాళ్ళు వున్నారు. కాని నా అభిప్రాయంలో వెంకటరమణస్వామి సర్వదేవతాత్మకమైన పరమాత్మ అనియే. అయనే విష్ణువు. ఆయనే పరమేశ్వరుడు. అందుచేతనే అక్కడ బిల్వార్చన జరుగుతున్నది. అంబికయు ఆయనే. ఇప్పటికీ ఆయనకు అభిషేకము శుక్రవారమునాడే జరుగుచున్నది. శుక్రవారము అమ్మవారికి వినియుక్తమైన రోజు. వారికి చీరనే కట్టుచున్నారు. అంతా ఆయనే అని నా అభిప్రాయం. ఆయనను సుబ్రహ్మణ్యస్వామి అని అభిప్రాయపడేవారు చెప్పేకారణము, వారు కొండశిఖరమున ఉండటం. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు సాధారణంగా కొండమీదనే వుంటాయి. ఉత్తరహిందూ స్థానీయులు ఏడుకొండలవానిని బాలాజీ, బాలాజీ అని వ్యవహరిస్తారు. బాలుడు, కుమారుడు అన్నపేళ్ళు శివశక్తులకు పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామినే సూచిస్తవి. తిరుపతిలో కుమారధార అనే ఒక తీర్థముకూడా ఉన్నది. ఆలయానికి ప్రక్కనేఉన్న తీర్థము పేరుకూడ - స్వామి పుష్కరిణి. స్వామి అనగా కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడే. సకలలోకములను, జీవులను, జడవస్తువులనూ తనసొత్తుగా (స్వం) కలవాడే స్వామి అయితే ఆపేరు విశేషముగా ఎందులకు సుబ్రహ్మణ్యుని పట్లనే వ్యవహరింపబడుచున్నది? వారి కంతగొప్పతన మెట్లావచ్చింది?

ఆకాశం మేఘావృతమై, వరం కురియబోతుందనగా ఒక్కమెరుపు ఆకాశం ఈ అంచునుంచీ ఆ అంచువరకూ మెరుస్తుంది. ఆ క్షణంలో తిమిరం తిరోహితం అవుతుంది. కొన్ని లక్షలజనరేటర్లు ఉత్పత్తి చేసే విద్యుచ్ఛక్తి ఆ ఒక్కక్షణంలో వెలిగిపోతుంది. ఆ విద్యుచ్ఛక్తి అంతకుముందు లేదా? లేని వస్తువు ఏలా వ్యక్తమౌతుంది? శాస్త్రజ్ఞులు విద్యుచ్ఛక్తి ఎల్లకాలమందునూ, సర్వత్రా వున్నదనీ అంటారు. కానీ అది మనకు వ్యక్తమవటంలేదు. నీటినుంచి పుట్టన ఆవిరి మేఘములుగా మారినపుడు, ఆశక్తి ధనధృవాంశగాను, (పాసిటివ్‌), ఋణధృవాంశగానూ, (నెగటివ్‌) ఉంటున్నది. ఆ మేఘములు గుమిగూడినపుడు వానిలో ఒక సంచలన మేర్పడి రెండు ధృవములూ చేరి, మెరపువలె మెరుస్తున్నవి. అవి విడిపోయినపుడు మెరుపు మాయమౌతున్నది. ఇది జడశక్తుల నుంచి పుట్టుతున్న విద్యుచ్ఛక్తి. ఈ జడశక్తులకు ఆధారముగా మరొకశక్తి యున్నది. అదియే చిచ్ఛక్తి, లేక జ్ఞానశక్తి . తన శక్తిని తెలుసుకొనక, సర్వవ్యాప్తమైన పరమవస్తువు మొదట ఉన్నది. అది ధనఋణాంశలుగా విభజన మౌతున్నది. వానిచే మనము శివము, శక్తి అని వ్యవహరిస్తున్నాము. ఇవి కుడిఎడమలుగా వున్నవి. ఈశ్వరుడు కుడిభాగమునందును, అంబిక ఎడమభాగమునందును నెలకొని యున్నారు.

వీరిద్దరు వేర్వేరుగా వున్న చాలదు. మేఘములున్న చాలదు. ఈ రెండుశక్తులూ కలసిననే మెరుపు పుట్టుచున్నది. శివశక్తులు ఇద్దరూ కలిసిననే జ్ఞానజ్యోతి ఏర్పడగలదు. అట్లేర్పడిన బాలుడే కుమారుడే సుబ్రహ్మణ్యుడు. అతడు శక్తిహస్తుడు. బ్రహ్మత్వము లోకానుగ్రహార్థము మూర్తీభవించినపుడు సుబ్రహ్మణ్యుడని విలసిల్లుతున్నాడు. స్వామి అను నామధేయము ఆయనకే. శివశక్తులు సంయోగమున పుట్టిన కృపామూర్తియే సుబ్రహ్మణ్యుడు.

మేఘములనుండి పుట్టిన తటిల్లేఖ బాహ్యతిమిరాన్ని మాత్రము పోగొట్టుతున్నది. శివశక్తులకు పుట్టిన జ్ఞానజ్యోతి స్కందుడు బాహ్యాంతరతిమిరములను రెంటినీ శాశ్వతముగా తనదివ్యశక్తిచేత పారద్రోలుతున్నాడు. విద్యుద్ఘాతమునకు, (పిడుగు పడినపుడు) మనిషి మరణిస్తున్నాడు. స్కందుని శక్తి అట్లాకాక అనుగ్రహదాయకమై మనకు అమరత్వాన్నీ అమృతత్వాన్నీ యిస్తున్నది. ఆ శక్తి తనవలెనే మనలను కూడా మార్చివేయుచున్నది. అరుణగిరినాథుడు అనే ఆయన ద్రావిడదేశములో జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు. ఆయన 'కందరనుభూతి' అనే ఒక గ్రంథాన్ని వ్రాశాడు. అందులో ఆయన అంటాడు; ''వేర్వేరుగా నున్న శివభక్తులేకమై ఒక దివ్యశక్తి నుత్పాదించి, ఆ శక్తి అనుగ్రహంచేత, ద్వైత భ్రమలోవున్న మనలను ఏకత్వంలోనికి తీసుకొని వెళ్ళి తనలో కలుపుకొంటున్నది.' అని.

అరుణగిరి తానువ్రాసిన తిరుప్పుగళ్‌ అనే స్తోత్రగ్రంథములో ప్రతియొక్క స్తోత్రములోనూ చివర 'పెరుమాళే' అని ముగిస్తున్నారు. పెరుమాళ్‌ అనగా పురుషోత్తముడు. పెద్ద మనిషి. ఈ పదం విష్ణుపరమైనది. శివశక్తులకు పుట్టిన సుబ్రహ్మణ్యుని ఆయన వైష్ణవపరంగా కీర్తించుటకూడ అందముగానే వున్నది.

ద్రావిడభాషలో సుబ్రహ్మణ్యుడికి 'మరుగన్‌' అన్నఅభిధానమున్నది. మురుగన్‌, మరుగన్‌ అని వ్యవహారములో నున్నది. మురుగన్‌ అన్న పదానికి అందగాడని అర్థము. మరుమగన్‌ అనగా మేనల్లుడు. స్కందుడు విష్ణవుకు మేనల్లుడు. వళ్ళీ దేవసేన ఇరువురూ విష్ణువు కొమారైలే. అందుచేత సుబ్రహ్మణ్యుడు విష్ణువుకు మేనల్లుడుగానూ, అల్లుడుగానూ వున్నాడు. ఇట్లు శైవమునకూ వైష్ణమునకూ వివాహసంబంధముండట మనం గమనించాలి.

ఉత్తర దేశంలో మాత్రం సుబ్రహ్మణ్యుడు గృహస్థుడుగాకాక, సంతత బ్రహ్మచారిగనే వ్వవహరింప బడుతున్నాడు. కొన్నిచోట్ల ఆయన ఆలయములందు స్త్రీలకు ప్రవేశ బహిష్కరణకూడా కద్దు. అచ్చట వారికి కార్తికేయుడనే అభిధానమే ఎక్కువ.

శివుని లలాటనేత్రమునుంచీ ఆరు అగ్నిశిఖలుద్భవించినవి. అవి శరవణ స్తంబ సంవృతమైన ఒక కొలనులోని కరిగి షణ్ముఖమూర్తిగా పరిణమించినవి. అపుడు కృత్తికా కన్యలు ఆరుగురు వారికి స్తన్యమిచ్చిరి. ఆకాశమందున్న కృత్తికా నక్షత్రములను ఆరునక్షత్రములకు అధిదేవతలు వీరే. కృత్తికాకన్యలచే పెంచబడినందున ఆయనకు కార్తికేయుదన్న పేరుకల్లినది. ఉత్తరభాతములో సుబ్ర హ్మణ్యుని కార్తికేయుడనియు, కుమారుడనియు పిలుచుచున్నారు. అక్కడ సుబ్రహ్మణ్యమను అభిధానమునకు ప్రభావము తక్కువ. కాళిదాసువ్రాసిన గ్రంథమును కూడా ఆయన కుమారసంభవమనియే పేర్కొన్నాడు. ఈ కుమారసంభవ ప్రసక్తి మొదట వాల్మీకి రామాయణమందు వచ్చినది. బాలకాండమునందు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు స్కందోత్పత్తిని వివరిస్తున్న సందర్భములో -

''కుమార సంభవశ్చైవ ధన్యఃపుణ్యస్తథైవచ'' - అని వ్రాయబడినది. వాల్మీకికి సాధారణముగా రామాయణసర్గ పారాయణలకు ఫలశ్రుతి చెప్పువాడుక లేదు. కానీ కుమారస్వామి యుత్పత్తి కల ముప్ఫై ఏడవ సర్గము చివర (బాలకాండము)-

భక్తశ్చయః కార్తికేయే కాకుత్‌స్థ భుని మానవః|
ఆయుష్మాన్‌ పుత్రపౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్‌||


రామా! భూమియం దేమనుష్యుడు కుమారస్వామి యందు భక్తి కల్గియుండునో అతడు దీర్ఘాయువై, పుత్రపౌత్రాదులతో యుండి అంతమున కుమారస్వామి లోకము నొందునని ఫలశ్రుతి చెప్పబడినది.

ఆదికవి ఐన వాల్మీకి బాలకాండమం దుపయోగించిన కుమారసంభవమనే పదద్వయమును మహాకవి కాళిదాసు మంగళవాక్యముగా గ్రహించి తన గ్రంథమునకు తద్వత్తుగా నామకరణం చేశాడు. కుమారస్వామి అన్నపేరు ననుసరించియే కౌమారమత మేర్పడియున్నది. షణ్మతములని వ్యవహారమందున్నది. గణపతిని ప్రధానముగా ఉంచుకొని చేయు ఉపాసన గాణాపత్యము సూర్యుని ప్రధానముగా ఉంచుకొని ఉపాసన సౌరము. అంబికను పరమతాత్పర్యముగా ఉంచుకొని చేయు ఉపాసన శాకము. శివోపాసన శైవము. విష్ణూపాసన వైష్ణవం. సుబ్రహ్మణ్యుడు పరమాత్మ అని ఉపాసన చేయడమే కౌమారం.

'స్కందసాలోక్యతాం వ్రజేత్‌' అని వాల్మీకి ఫలశ్రుతి చెప్పారు. స్కందుడనే పేరుకూడా చాలప్రసిద్ధమైనది. స్కన్నమైనవాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతి నుండి ఆవిర్భవించిన ఆరుజ్యోతుల స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. ఈ నామ విశేషాన్ని మనస్సులో వుంచుకొనే కృష్ణద్వైపాయన వ్యాసులవారు వ్రాసిన పురాణానికి స్కాందమని నామకరణం చేశారు. ద్రావిడభాషలో స్కందపదమునకు వికృతి కందుడు. కాంచీ నగరమున ఉండిన కచ్చియప్పశివాచార్యులనే ఒకరు కందపురాణమనే పుస్తకాన్ని వ్రాశాడు.

మాతృదేవోభవ, పితృదేవోభవ అనునవి వేదానుశాసనములు. శివశక్తులు మనకు మాతాపితలుగా నున్నారు. వారు వేర్వేరుగాకాక అర్థనారీశ్వర రూపములో కలసియున్నారు. ఈవ్యవస్థ మనకు పరమలాభదాయకమని మనము వారివద్దకు వెడుతున్నాం. ఇందులో చిక్కులుకూడ లేకపోలేదు. ఈ అమరిక సందేహాస్పదంగా కూడా ఉన్నది. కాళ్ళపైబడి వేడుకొంటామంటే ఎడమ కాలేమో అంబికది. కుడకాలు ఈశ్వరునిది. మనం ఆశ్రయించవలసినది అయ్య పాదమునా? అమ్మచరణమునా? అర్చన చేద్దామంటే ఒకరికి ఒక పుష్ఫం ఇష్టం; మరొకరికి వేరొకటి ఇష్టం. పైగా నిషేధ ద్రవ్యములు వేరే వున్నవాయెను. ఈ వంకపడవలసినవస్తువు అవంకపడితే ముప్పు. పోనీ ఈ పాదాశ్రయాంచాలు కటాక్షం వేడుకొందాం అంటే దానిలోనూ వామదక్షిణ నేత్రముల బెడదవున్నది.

పోనీ అర్థనారీశ్వరులకు అవిభాగమైనవస్తువు ఏదైనా వున్నదా? వారిమనసు అవిభజనీయముకదా? వారి మనస్సు ఏలావుంటుంది? అది ప్రేమప్రపూర్ణము. వారి మనస్సును మనం ఎరుగగలిగితే, మనమనస్సు శాఖామృగంవలె వివిధ దిశలకు పరిభ్రమించదు.

పరమేశ్వరుడు సత్‌, అంబిక చిత్‌ అనిచెప్పే శాస్త్రమువలన ప్రయోజనమేమి? మనలను ఉద్ధరించేది అది కాదు. వారి ప్రేమప్రపూర్ణమైన అనుగ్రహమే. ఈ పరిపూర్ణమైన ప్రేమ వారి కెందున్నది? స్కందునిపైవున్నది. ఆ స్కందుని మన మాశ్రయించామంటే?

స్కందుడు పరమభాస్వరమయిన రూపముకలవాడు. పరాక్రమశాలి. ఎవరికినీ సంహరించుటకు వీలుకాని శూరుడు. తారకుడనే అసురుని పరిమార్చిన మూర్తి. తండ్రియైన శివునికే ఉపదేశించిన జ్ఞానపండితుడు. అరవభాషలో తగప్పన్‌ అనగా తండ్రి. 'తగప్పన్‌స్వామి' అనికూడ వారికొక పేరు. దక్షిణదేశంలో స్వామిమల యనునదొక సుబ్రహ్మణ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి ఈశ్వరునికి ఉపదేశం చేస్తున్నారు.

ఈశ్వరుడు కోరి తనకు మించిన పుత్రుణ్ణి కన్నాడు. తండ్రికి సాధారణంగా ఉండే అభిలాష ఏమంటే తాను సర్వోత్కృష్టుడుగా వుండవలెనని కానీ తన పుత్రుడు తనకన్న అధికంగా వుంటే మాత్రం తండ్రి సంతోషిస్తాడు. 'పుత్రాదిచ్ఛేత్‌ పరాజయం' పరాజయం కలిగితే పుత్రుని చేతుల్లోనే జరగాలి. పరమేశ్వరునికి కూడా ఈ లాంటి అభిలాషే వున్నట్లున్నది. తానే అంబికా సహాయుడై పుత్రరూపంలో వచ్చాడు. కానీ ఈ రూపంలో ఉన్న వీర్యమూ, జ్ఞానమూ, వర్చస్సూ మునుపు కంటే ఎన్నో రెట్లు అధికమై ప్రకాశించినవి.

సత్‌, చిత్‌ అను రెండుపదములున్నవి. సత్‌ అనగా ఉనికి. చిత్‌ అనగా అంబిక, చిదేక రసరూపిణి. ఈ సత్తు చిత్తులు రెండున్నూ ఏకముకాగా ఆనంద ముద్భవించింది. ఆ సచ్చిదానంద స్వరూపుడే సుబ్రహ్మణ్యము. శివమనే మంగళమూ, అంబిక అనే పరమ కారుణ్యమూ, కలసిన రూపే సుబ్రహ్మణ్యుడు. ఈ సచ్చిదానందమూర్తినే దక్షిణ దేశములో సోమాస్కందుడని శివాలయములలో ఉత్సవమూర్తిగా ఉంచి ఉత్సవములు నడుపుతున్నారు. ఉమ, స్కందుడు కలసిన శివమూర్తి సోమాస్కందుడు.

స్కాందము ఒకటిన్నరలక్ష శ్లోకముల గ్రంథము. స్కాందము కుమారోత్పత్తి చెప్పురామాయణము. కుమార సంభవము - ఇవన్నీ సంస్కృతభాషలో వ్రాయబడినవి. కుమారగుప్తుడని ఒక రాజు ఉండేవాడు. ఆర్యావర్తములోని రాజులు చాలమంది కుమారనామధారులే. ప్రస్తుతము పాకీస్థానమునకు వెళ్ళిపోయిన వాయవ్యభూభాగమున దొరికిన కుషానుల కాలమునాటి నాణములలో మయూర వాహనుడైన స్కందుని రూపమున్నది. కొందరు రాజలు సుబ్రహ్మణ్యుని, బ్రహ్మణ్య కుమారుడని వ్యవహరించి కులదైవముగా ఆరాధించేవారు. రాజులు తమ్ము బ్రహ్మణ్యులని చెప్పుకొనేవారు. సుబ్రహ్మణ్యపదములో 'సు' అనే అక్షరమును తొలిగిస్తే మిగిలేది బ్రహ్మణ్యమే కదా.

దక్షిణ దేశంలో వేదములను, సంస్కృతమునూ అభివృద్ధికి తెచ్చిన కంచి పల్లవరాజులు తమ్ములను శివభక్తులైన పరమమాహేశ్వరులుగానూ, విష్ణుభక్తిలో ఎనలేని పరమ భాగవతులుగాను చెప్పుకొనుటతో బాటు, స్కందోపాసన విశేషముగా చేసి పరమ బ్రహ్మణ్యులని వర్ణించుకొన్నారు. శాసనములలో వీనిని చూడనగును.

ఋగ్వేద పంచరుద్రములో ఈశ్వరుని స్తుతించు సందర్భమున 'కుమారునికి నమస్కరిస్తున్నపిత' - అని చెప్పుట ఒక విశేషము. ఛాందోగ్య ఉపనిషత్తులలో సనత్కుమారులను గూర్చి వచ్చుచున్నది. పాణిని వ్యాకరణము, దానిపై పతంజలి వ్రాసిన మహాభాష్యములోనూ స్కందునిగూర్చియు, విశాఖుని గూర్చియు విస్తార ప్రస్తావన కలదు. బోధాయన ధర్మ సూత్రములందు అనుదినము చేయు శివపూజయందు స్కందునికి కూడ ప్రాముఖ్యత ఇవ్వబడియున్నది. ఆపస్తంబ మహరి అనుదినము ఇవ్వవలసిన దేవబలులలో స్కందుని, అతని పారిషదులను చేర్చియున్నారు.

కౌమారము విశేషముగా ద్రావిడ దేశములో ప్రచారముననున్నది. మురగన్‌ తమకు సొంతదైవమని, అధిష్ఠాన దైవమని తమిళులు కీర్తిస్తుంటారు. ఆరుపడైవీడు అన్న ఆరుసుప్రసిద్ధ సుబ్రహ్మణ్యక్షేత్రములు డ్రావిడదేశమందే వున్నవి. సుబ్రహ్మణ్యుడు తమిళ్‌ దైవమని కీర్తింప బడుతున్నాడు. అగస్త్యులకు ద్రావిడవ్యాకరణము ఉపదేశించినది సుబ్రహ్మణ్యుడు. నత్కీరుడనే కవి 'తిరుమురుగాట్రుప్పడై' అనుగ్రంథం వ్రాశాడు. ఈ పుస్తకాన్ని పారాయణ చేసి ఎంతో మంది తమిళులు విశేషఫలమును పొందివున్నారు. కావళ్ళు ఎత్తటం, షష్టీవ్రతం, కృత్తికలు జరపటం తమిళనాడులో విశేషమైన ఉపాసనా విధానాలు. ఈ ఉపాసనాబలిమిచే ఇంచుమించు సుబ్రహ్మణ్యుని, తమిళులు తమిళునిగా మార్చేశారు!

ఈ కాలంలో ద్రావిడ దేశంలో తమిళ సంస్కృతి వేరు. వైదిక సంస్కృతి వేరు. అని చెప్పుటలో కొందరికి అభిరుచి. ఈ ఆర్యద్రావిడ వివాదం తెల్లవానిపుణ్యమా అని పరిశోధన అనే నెపంలో వచ్చిన అనర్థం. అది స్పర్థ తెచ్చి పెట్టడానికై ఉద్దేశించినది. ఆ వివాదం మనకు అక్కరలేదు. సుబ్రహ్మణ్యుని ఒక్క ద్రావిడ దేశమునకే పరిమితి చేయుటకు వీలులేదనే నేను ఇంత సేపు చెప్పినది నిరూపించుచున్నది. వైదికసంస్కృతిని నిలబెట్టడానికి ఏర్పడినదైవమే ఆయన అని చెప్పుటకు వారి నామధేయము సుబ్రహ్మణ్యమే చాలును.

వైదిక కర్మలలో ప్రధానమైనది హోమం. హోమమునకు అగ్ని అవసరం. దేవతావిశేషములలో అగ్నిస్వరూపుడు సుబ్రహ్మణ్యుడే. ఆకాశరూపమైన ఈశ్వరుని సాన్నిధ్యంలో అగ్నిశిఖగా తోచి, వాయువుతో కలసి గంగలో శరవణస్తంభమున (జలసంబంధమున) ఉద్భవించి భూమిని ఆధారముగాగల భూధరములలో (కొండశిఖరములలో) ఆలయములయందు విలసిల్లే పంచభూతస్వరూపి యైన పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడే. వారికి 'అగ్నిభూః' అని ఒక పేరున్నది. అమరకోశము సేవానీః అగ్నిభూః గుహః అని సుబ్రహ్మణ్యనామావళిని గ్రథనం చేసింది.

మనహృదయ కుహరములలో ఆత్మస్వరూపమున నెలకొన్న గుహుడే బయట అగ్నిస్వరూపియై ఉన్నాడు. వైదిక కర్మలు అగ్నిప్రధానములగుట చేతనూ అగ్నియే సుబ్రహ్మణ్యుడగుటచేతనూ, వైదిక రక్షణార్థము రెండు పర్యాయములు సుబ్రహ్మణ్యుడు అవతరించ వలసివచ్చినది. ఒక అవతరణ ఉత్తరభారతమున జరిగినది. రెండవది దక్షిణభారతమున జరిగినది.

దక్షిణభారతమున 'సంబంధమూర్తి' అనే పేరిట స్వామి అవతరించారు. ఈయన సమయాచార్యులలో నొకరు. వీరిని 'తిరుజ్ఞానసంబంధర్‌' అనికూడ పిలుచుటకద్దు. వీరు పుట్టినపుడు జైనమత ప్రాబల్యం దక్షిణాదిని ఉండేది. బ్రహ్మణ్యస్థాపనకోసమో, జైనమతమును ప్రతిఘటించుటకూ వీరు అవతరించినారనే చెప్పాలి.

ఉత్తరదేశమున బౌద్ధుల ఆధిక్యమును ప్రతిఘటించుటకు స్వామి 'కుమారిలభట్టు' అనే పేరిట జన్మించారు. భక్తి జ్ఞానము మొదలైన వానినెల్లా ఒక వంక ఉంచి, వైదికకర్మానుష్ఠానము చేతనే పరమశ్రేయస్సును పొందగలమని వీరు బోధించిరి.

బౌద్ధులను ప్రతిఘటించుటకు వారి మతతత్త్వములను సంపూర్ణముగా తెలుసుకొన్న కానీ వీలుకాదు. అందుచేత కుమారిలభట్టు ఒక బౌద్ధభిక్షువు వేషము వేసుకొని బౌద్ధ విహారమందు చేరి బౌద్ధమతగ్రంథ పరిశీలన అధ్యయనము చేయుటకు ప్రారంభించెను. రహస్యముగా ఎవరికీ తెలియక తాను చేయవలసిన నిత్యకర్మలను మాత్రము ఏలాగో ఆయన ఒక విధముగా అంతరంగమున పూర్తి చేయుచుండెను. ఇట్లు కొంతకాలములో బౌద్ధమత సిద్ధాంతములను పూర్తిగా ఆయన గ్రహించగల్గెను.

కానీ వీరి విషయము బౌద్ధులకు ఏదో ఒక విధముగా తెలిసిపోయినది. ఈయనను ప్రాణములతో వదలిన తమ మతమునకు ముప్పుకలుగునవి వారిని మట్టుపెట్టదలచిరి. ఈ విషయమున వారి మతమునందలి మౌళిక సత్యము - అహింసావాదము ఏ దేశములకు పోయెనో తెలియదు! కుమారిలభట్టును మేడమీదకు తీసుకొని వెళ్ళి, ఏదో అంతస్తునుండి వారు క్రిందకి త్రోసిరి.

క్రింద పడుతున్న కుమారిలభట్టు, వేదప్రమాణమే సత్యమైనచో, నాకు ఈ పతనమువలన ఏవిధమైన ఆపదయూ కలగరాదు' అని ప్రతిజ్ఞ చేసెను. ప్రతిజ్ఞ చేసిన రీతిగానే వారికి ఏ విధమైన గాయమూ కలుగక సురక్షితముగా క్రిందికి వచ్చిరి. కంటిలో మాత్రము ఒక చిన్నరాయి తగిలి నొప్పి చేసినది.

తనకు ఈ చిన్న గాయముకూడ తగిలియుండరాదని, కుమారిలభట్టుకు వేదముపై కోపము వచ్చినది! అపుడు అశరీరవాణి ఈవిధముగా పలికినది.

''నీవు వేదప్రమాణమే నిత్యమైనచో నాకు ఆపదకలుగరాదు' అని ప్రతిజ్ఞ చేసితివి. ఆ ప్రతిజ్ఞలో సంశయాంశమున్నది. నీకు ఆ సంశయములేక యుండిన వేదప్రమాణము నందు పరిపూర్ణమైన నమ్మిక ఉండి యుండిన ఈ చిన్నగాయము కూడ నీకు తగిలియుండదు.''

ఇట్లు బౌద్ధమతతత్త్వములను ఔపాసన పట్టిన కుమారిలభట్టు బౌద్ధుల సిద్ధాంతములను వాదములలో సులభముగా ఖండింపగల్గెను.

పిదపకాలమున, కుమారిలభట్టుకు తాను బౌద్ధులను వంచన చేసినామన్న విషయము గుర్తుకువచ్చెను. తాను కర్మిష్టికనుక చేసిన పాపమునకు తగిన ప్రాయశ్చిత్తము చేసికొనదలచి ఆయన తుషాగ్ని ప్రవేశము చేసెను. ఇట్లు అగ్ని స్వరూపుడైన సుబ్రహ్మణ్యావతారము కుమారిలభట్టు చివర తుషాగ్నిలో ప్రాణము వదలుట ఆ అవతార సమాప్తికి తగియేయున్నది. వారు ధర్మశాస్త్రము కొరకు శరీర త్యాగము చేసిరి.

జ్ఞానసంబంధుల వారికి పరహారేళ్ళ ప్రాయమురాగా బంధువులు వారికి పెళ్ళి చేయ నిశ్చయించారు. చిన్నతనమున పరమేశ్వరియే వారికి స్తన్యమొసగినది. వారు పరిపూర్ణమైన జ్ఞానులు. వారికి వివాహమెందుకు కానీ ఈశ్వర సంకల్పము తెలిసిన జ్ఞానసంబంధులు పెళ్ళికి ఒప్పుకొన్నారు.

తిరునల్లూరులో ఈకల్యాణము జరిగినది. పాణిగ్రహణమైనదో లేదో, బంధుసమేతంగా సంబంధులవారు ఆ ఊరిలోని శివాలయానికి వెళ్ళారు. ఆలయమంతయు జ్యోతితో నిండియుండెను.

అక్కడ భక్తితో బాష్పాంచిత నేత్రులై శివునిపై ఒక పంచాక్షరీ పదికమును (ద్రావిడభాషలోని వృత్త విశేషము) పాడారు. పాటపాడుకుంటూ సహకుటుంబసమేతముగా బంధుమిత్రాదులతో పరమేశ్వరుని జ్యోతిలో లీనమైపోయారు. సుబ్రహ్మణ్యావతారమైన సంబంధులు జ్యోతిలో కలిసిపోవటం, అగ్ని అగ్నిగా మారిపోవటమే కదా!

బంధువులు,సంబంధులను, వివాహాబంధంలో ఇరికించాలని చూశారు. వారేమో వీరిని కలియగట్టుకొని అందరికీ బంధవిమోచన చేసి మోక్షలక్ష్మీ సంబంధం కలుగచేశారు!!

సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపి; తేజస్వి. కాని గంగాతనయుడగుటచేత అమృతమువలె చల్లదనము కలగజేసే గుణమూ వారివద్ద వున్నది. తిథులలో ఆరవది షష్టి. ఈయన షష్టీప్రియుడు. షడాననుడు; ఆరుముఖములు కలవాడు. ఈయన మంత్రము షడక్షరి. కామక్రోధలోభ మోహ మద మాద మాత్సర్యములనే అరిషడ్వర్గమును నాశనము చేయగల దిట్ట, సేనాని ఆయనే.

సుబ్రహ్మణ్యుని రెండు అవతారములను గూర్చి ముచ్ఛటించాము. ఇపుడు మూడో అవతారమును గూర్చి కొంత చెప్పుకొందాము. ఇది నిజానికి అవతారము కాదు. సుబ్రహ్మణ్యుడు అవతరించుటకు ముందు వారు ఎవరుగా ఉండిరో చెప్పే కథ ఇది. ఈ విషయం చాలా రోజుల వరకు నాకే తెలియకుండా ఉండినది. తరువాత తెలిసినది. ఎట్లా నాకు తెలిసినదీ చెప్పి, ఈ విషయం గూర్చి కొంత వివరిస్తాను.

వ్యాసాచార్యులవారు బ్రహ్మసూత్రాలను వ్రాసిరి. ఇది పరబ్రహ్మతత్వాన్ని విచారణ చేసే గ్రంథం. దీనిలో మూడవ అధ్యాయంలో మూడవపాదంలో ముప్ఫై రెండవ సూత్రం, 'ఒక అధికారముతో అవతరించిన వారికి, అధికారము ఉన్నంతవరకూ శరీరంలో వాసముంటుంది.' అని చెప్పుతున్నది. దానికి భాష్యంవ్రాస్తూ మన ఆచార్యులు, 'బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుడుకూడ, తానే రుద్రునికి వరప్రదానము చేసి, దానికొఱకై స్కందుడుగ అవతరించాడు.' - అని దృష్టాంతముగా వివరించారు.

సనత్కుమారుడు పరమేశ్వరునికి వరమిచ్చిన కథ అంతవఱకు నేను ఏ పురాణములందునూ చూచినది లేదు. నన్ను కలుసుకొన్న పండితులను అనేకులను అడిగిచూచాను. వారికీ తెలియలేదు. అంజనేయస్వామియు వెదకి వెదకి, కట్టకడపట ఈ కార్యాన్ని అష్టాదశపురాణాలను సంక్లిప్తంగా అరవవచనంలో వ్రాసిన శ్రీవత్ససోమదేవశర్మకు అప్పగించారు.

శర్మగా నాకు భిక్షావందనం చేస్తూ, దానితోబాటు పెద్దబిక్షగా, ఈ డిస్కవరీని కూడ అందించారు. వారు ఈ విషయం వెదకి చూడగా త్రిపురారహస్యమనే గ్రంథంలో మహాత్మ్యకాండలో ముప్ఫైఏడవ అధ్యాయంలో ఈ కథ కనపడ్డదట. ఇక కథకు వస్తారు.

సనత్కుమారులు బ్రహ్మమానసపుత్రులు. పరమజ్ఞాని. శుక్రాచార్యుల వలె లోపల వెలుపల అనే భేదంలేక అంతా ఒకటే అన్న అద్వైతస్థితిలో ఉండేవారు. ఇటువంటివారికి విచిత్రంగా ఒక స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో దేవాసుర యుద్ధం జరిగింది. ఆయుద్ధంలో దేవసేనాపతిగా పాల్లొని సనత్కుమారులు అసురసంహారం చేశారు.

స్వప్నం నుంచి మేల్కోగానే వారికి ఆశ్యర్యం వేసింది. తండ్రి అయిన బ్రహ్మవద్దకు వెళ్ళి ఈవిషయం చెప్పి, ఈస్వప్నానికి అర్థమేమి? అని అడిగారు.

'నాయనా! నీవు పూర్వజన్మలో వేదాధ్యయనం చేశావు. దానిలో వచ్చే దేవాసుర యుద్ధమనే విషయం నీ మనస్సులో గాఢంగా నాటుకొన్నది. వైదిక యజ్ఞముల చేత తృప్తులై వరప్రదానం చేసే వాళ్ళు దేవతలు. వారిని జయించి స్వాధీనం చేయదలచేవాళ్ళు అసురులు. నీకు వేదమందున్న గాఢ అభిమానం చేత,' ఈ అసురులనందరినీ మనమే సంహారం చేయాలి' అని ఆవేశపడ్డావు. ఆ ఆలోచనయే ఈ జన్మలోనూ నిన్ను వెన్నంటి వచ్చింది. అదే స్వప్నంలో బహిర్గతమైనది.

నీకు ఏ ఆలోచన ఉన్నప్పటికీ అది వాస్తవముగా జరిగియే తీరుతుంది. అందుచేత నీవు ఒకరోజు యథ్యార్థముగా దేవాసుర యుద్ధములో దేవసేనాపతిగా పాల్గొంటావు. అసురసంహారం చేస్తావు. కాని ఈ జన్మలో - దేవతలా? అసురులా? సర్వం బ్రహ్మమయం' అన్న భావనలో నీవు ఉండే దాని వలన ఇంకొక జన్మనెత్తి ఈ కార్యాన్ని చేయబోతావు' అని బ్రహ్మ బదులు చెప్పారు.

వాక్కు, మనస్సు, శరీరము - ఈమూడూ ఒకని సత్యములో ప్రతిష్ఠ ఐనచో, అతనికి అతని ఉద్దేశములేకనే, ఒక గొప్పశక్తి సిద్ధిస్తుంది. అనగా వాళ్లు సత్యాన్నే చెప్పనక్కరలేదు. వారు చెప్పినది సత్యమౌతుంది. పొరపాటుగానో, ఇచ్చలేకయో వారు ఒకటి చెప్పినా అది వాస్తవిక మౌతుంది.

పరమ సత్యప్రతిష్ఠితుడైన సనత్కుమారులు కలకనిననూ అది కల్లకాక నిజమై తీరాలి.

సనత్కుమారులు ఆత్మారాములు. పరబ్రహ్మము తనలోనే అనుభవిస్తూ కూరుచున్న పరమజ్ఞానులు. ప్రపంచమే ఒక స్వప్నమని భావించే పరమవిరాగులు. అందుచేత వారు తమస్వప్నాన్ని గూర్చి విచారించక అలాగే ఉండిపోయారు.

కానీ సనత్కుమారుల స్వప్నంలో వచ్చిన విషయం అసత్యం కాకూడదే అన్న విచారం పరమేశ్వరునికి - మహాసంసారికి - పట్టుకొన్నది! అందుచేత సనత్కుమారులు తనకోసం తనదర్శనార్థం తపస్సు చేయకపోయినా స్వయంగా సనత్కుమారులను వెదుక్కుంటూ పార్వతీసమేతులై సనత్కుమారుల ఆశ్రమానికివచ్చారు.

సనత్కుమారులస్థితి అద్వైతస్థితి. వారికి చెట్టూ చేమ, గుట్టా రాయి అంతా ఒకటిగానే ఉంది. అంతా బ్రహ్మమయం వారి దృష్టిలో బ్రహ్మంలో ఉచ్చనీచములు లేవు. గరిస్ఠ కనిష్ఠములు లేవు. అందుచేత పరమేశ్వరుడు వచ్చినా వారికి భేదమేమీ తెలియలేదు. వారినీ బ్రహ్మమే అని అనుకొన్నారు. పరమేశ్వరునికి పూజాదికములు అర్పించాలన్న భావం కూడా తోచలేదు. వారు కూర్చున్నది కూర్చున్నట్లే ఉన్నారు.

పార్వతీపరమేశ్వరులు సుదీర్ఘకాలం సనత్కుమారుల ముందు నిలచున్నారు. ప్రయోజనమేమీ కన్పించలేదు. వారు అలాగే అచలంగా ఉన్నారు. దీనిని చూడగానే ఆ ఆదిదంపతులకు ఆనందం కలిగింది. ఇట్టి పరమజ్ఞాని అయిన పిల్లవాడిని చూడగానే వారికి పరమసంతోషం కల్గింది. అయినప్పటికీ, పరమేశ్వరుడు దొంగకోపం తెచ్చుకొని.

''జ్ఞాని అన్న అహంకారమేకదా నీకు? మేము జగన్మాతా జగత్పితలం వచ్చివుంటే నీవు అమర్యాదచేస్తున్నావే? నేను నీకు శాపమిస్తే ఏమిచేస్తావు?'' అని ప్రశ్నించారు.

సనత్కుమారులు భయపడలేదు. అలక్ష్యంగా 'మీరు కోపించి శాపమిస్తే ఇవ్వండి దానికేమి? అది ఆత్మను ఏ విధంగానూ బాధించదు' అని బదులిచ్చారు.

అహా ఎట్టి ఉత్తమ ఆత్మజ్ఞాని? అని ఈశ్వరుడు ఆశ్చర్యపడి మరొకింత పరిశీలింపదలచి, 'నాయనా! నీ జ్ఞానమునకు మేము మెచ్చినాము. నీకు వరమేమికావలెనో కోరుకో' అని అడిగాడు.

''పరమేశ్వరా నీవు వరము. శాపము అనే పదప్రయోగం చేసేదానివల్ల వీనికంతా ఏదో వేర్వేరు ఆర్థాలున్నట్లు నీవు తలుస్తున్నట్లు తెలుస్తున్నది. అట్లైతేసరి. నీకు ఏదైనా వరం కావలసి ఉంటే కోరుకో అవరాన్ని నేనే యిస్తాను.''

సనత్కుమారులు చెప్పినది విని పరమేశ్వరునికి సంతోషం వేసింది. సర్వలోక మహేశ్వరుడైన ఆయన చాల వినయంతో తన్ను కొంచపరుచుకొని, వరదానం అడిగారు. సనత్కుమారుల స్వప్నం సత్యం కావటానికి ఈ వరమే దారియని ఈవిధంగా అడిగారు.

''నాయనా! నీవు పరమజ్ఞానిగ బ్రహ్మకు పుత్రుడవై పుట్టినావు. బ్రహ్మకు కల్గిన భాగ్యం నాకూ కలిగేటట్లు వరాన్ని ఈయి. మరొక జన్మలో నీవు నాకు పుత్రుడివిగా జన్మించవలె. ఇదే నా కోరిక.'' అని పరమేశ్వరుడు అడుగగా, 'ఆహా అట్లాగే నీకు పుత్రుడిగా జన్మిస్తాను', అని సనత్కుమారులు వరమిచ్చారు.

మనం కూడా జ్ఞానం కలిగేంత వరకే, 'మరోజన్మ మనకు వద్దు' అని ఏడుస్తూ ఉంటాం. జ్ఞానం ఏర్పడినదంటే ఇదంతా మాయమౌతుంది. వట్టి ఆనందసాగరమే మిగులుతుంది. ఇది కావాలి, అది వద్దు అన్న భావం సమూలంగా పోతుంది.

సనత్కుమారులు పరమేశ్వరుణ్ణి చూచి నీకు పుత్రుడిగా జన్మిస్తాను - అని అన్నారుకానీ, పార్వతిని చూచి అనలేదు. దీనిని గూర్చి సనత్కుమారులు యోచించారు. దీనిలోనూ వారికొక ధర్మం తోచింది. తన్ను వరమడిగినది పరమేశ్వరుడు కాని పార్వతి కాదు. పైగా 'అడుగనిది ఇవ్వకూడదు' అని శాస్త్రం చెబుతుంది. అందుచేత పరమేశ్వరునికి పుత్రుడిగా జన్మించాలే కానీ పార్వతికి కాదు. అని నిశ్చయించారు. ఈ విషయం సనత్కుమారులు బయటకి చెప్పాగానే, పార్వతికి తాను ఏమరి పోయిన విషయం గుర్తుకొచ్చి దుఃఖం వేసింది. ఆమె సర్వలోకజనని - ఆబ్రహ్మకీటజనని. వాస్తవమే. జ్ఞానాంబిక ఐన ఆమెకు ఈవిషయం తెలుసు. కాని సనత్కుమారులవంటి ఉత్తమజ్ఞాని' మరొక జన్మ ఎత్తుతున్నపుడు తన సంబంధం లేకుండా పుట్టుతానంటే, ఆమెకు మనస్సు ఓర్వలేదు. ఇటువంటి జ్ఞాని తనకున్ను ఆత్మజుడుగా పుట్టవలెనని ఆమెకు ఆశకలిగింది.

సనత్కుమారులు శాస్త్రం చెప్పి తర్కం చేసిన విధంగానే ఆమె కూడా తర్కం చేయనారంభించింది.

శాస్త్రములు పత్నీపతులకు అభేదమే చెప్పినవి. భర్త చేసే ప్రార్థన, భార్యను ఉద్దేశించే. అందుచేత నేను ప్రత్యేకంగా నిన్ను వరం కోరుకోవలసిన అవసరం లేదు. ఆయన అడిగారు. నీవు ఒప్పుకొన్నావు అందుచేత నాకు కూడ నీవు పుత్రుడిగా జన్మించవలసినది అని తన హక్కును (గఠష) నిలబెట్టుకోడానికి ఆజ్ఞానశక్తి ప్రయత్నించింది.

సనత్కుమారులు యోచించి ఇలా అన్నారు. 'అమ్మా' నీవు చెప్పేదేమో వాస్తవమే. అయినప్పటికీ నాకు ఈశ్వరునికి పుట్టటంలో వుండే తృప్తి మీ ఇరువురి సంబంధం వల్ల కలిగే జన్మలో లేదు. అంతా పరబ్రహ్మమని నాకు తెలిసినా, మీరు పెద్దజ్ఞాని అని నాకు బిరుదు (టైటిల్‌) ఇచ్చినా, గర్భవాసం చేసి, అధోముఖంగా జన్మించాలన్న విషయం గుర్తుకువచ్చినపుడు అదినాకు హేయంగానే ఉన్నది. బ్రహ్మజ్ఞానికి ఇలా ఉండరాదు. వాస్తవమే. కానీ నాకు అంతపరిపక్వత లేనట్లున్నది. నీవు కొంచెం పెద్ద మనసుచేసి ఈవిషయంలో బలవంతం చేయకుండా ఉంటే నేను సంతోషిస్తాను.

కానీ అంబికకు మనసు రాలేదు.

కొంచెం యోచనచేసి వాళ్ళు రాజీకి కు వచ్చారు.

పూర్వం భస్మాసురుడు తపస్సుచేయగా అతనికి పరమేశ్వరుడు చేయిపెట్టితే కాలిపోయే వరమిచ్చాడు. ఆ వరాన్ని పరిశీలించడానికి ఆ అసురుడు ఈశ్వరుని నెత్తిమీదనే చేయిపెట్టవలెనని చూడగా ఈశ్వరుడు పరుగెత్తవలసివచ్చింది. ఆ సమయంలో అంబిక సర్వజ్ఞ ఐనప్పటికీ, సాధారణ స్త్రీవలె భయపడి పరమేశ్వరుడు అదృశ్యంకాగానే, నీరైపోయింది. ఆనీటితో ఒక తటాకం ఏర్పడింది. అదే శరవణ తటాకం.

భస్మాసురుని సంహారానంతరం పరమేశ్వరుడు మళ్ళా కనపడగా, ఆమెకూడ తన స్వస్వరూపాన్ని గ్రహించింది. కానీ ఆ తటాకాన్ని అలాగే వుంచి దానిని ప్రేమతో చూచుకొంటూ ఉన్నది. ఆ శరవణతటాకం అంబిక దేహమే. ఆ విషయం ఆమెకు ఇప్పుడు జ్ఞప్తి కొచ్చింది.

సనత్కుమారుడు ఈశ్వరునికి జ్యోతిరూపంలో జనించగానే, జ్యోతిని శరవణతటాకంలో భరించి సుబ్రహ్మణ్య స్వరూపిగా వెలికివచ్చుటకు వాళ్ళు ఒడంబడిక చేసుకొన్నారు.

ఈశ్వరుని త్రినేత్రమునుండి అగ్నిశిఖ రూపములో సనత్కుమారులు ఉద్భవించారు. ఆ అగ్నిశిఖను గంగ మొదట ధరించింది. కానీ ఆ తేజస్సును ఆమె భరించలేక, శరవణతటాకంలో వదిలింది. అంతటితో సుబ్రహ్మణ్యుడు తొలుత గాంగేయుడై తర్వాత శరవణభవు డయ్యాడు. ఈనామమే శరవణభవ -అను షడక్షరి ఐనది. సుబ్రహ్మణ్యుడికి ఎన్నో పేళ్ళున్నవి. కానీ అన్నిటిలోనూ మంత్రరాజము-'శరవణభవ' అను షడక్షరియే. శరవణమనగా అంబిక, ఆ ఇచ్ఛాశక్తి కోరుకొన్నట్లే పరమేశ్వరునికి సనత్కుమారులు పుత్రుడై జన్మించినా, పేరు రూపమూ రెండూ ఆమెతో సంబంధం కలవి ఐనవి.

సనత్కుమారులే స్కందుడని ఛాందోగ్యోపనిషత్తు స్పష్టముగా తెలుపుతున్నది.

నారదులు సనత్కుమారుల వద్దకు జ్ఞానోపదేశమునకై వస్తారు.

'సకలవేదములు,ఇతిహాసములు, పురాణములు, శాస్త్రములు, దేవవిద్య, బ్రహ్మవిద్య, భూతవిద్య, నక్షత్రవిద్య, మొదలైనవన్నీ ఒక్కటీ బాకీలేక అధ్యయనం చేశాను, కానీ ఇవన్నీ బయటి విషయాలను గూర్చి తెలుపుతున్నవే కానీ, తన్ను తాను తెలుసుకొనే విషయాన్ని తెలపటం లేదు.

ఆత్మను తెలుసుకోని కారణంగా నేను దుఃఖంలో ఉన్నాను. మీరొకరే, నన్ను ఈ దుఃఖసాగరం నుంచి తరింపచేయగలరు.' అని నారదులవారు సనత్కుమారులను ప్రార్థిస్తారు.

''ఆత్మను మనం వెదుకుకొని పోనవసరం లేదు. క్రిందా, పైనా, ముందూ, వెనుకా, కుడిప్రక్కా, ఎడమప్రక్కా, అంతా సర్వమూ ఆత్మయే. దానిని ఒకడు ధ్యానించి ధ్యానించి, ఆ ఆత్మగానే పరిణమిస్తే, ఆ ఆత్మతత్త్వంలోనే ఎప్పుడూ విహరిస్తూ ఆనందంగా ఉంటాడు. స్వారాజ్యం అంటే అదే. ఆస్థితియే స్వరాట్‌ - నిజమైన చక్రవర్తి స్థితి. ఈ ఉత్తమస్థితి లభించాలంటే మొదట ఆహార శుద్ధి అవసరం. పిదప క్రమేణ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మనస్సు శుద్ధికాగానే, ధ్యాననిష్ఠ ఏర్పడుతుంది. అపుడు ఆటంకములన్నీ, తొలగి, ఆత్మస్వరూపంగానే ఒకడు నిలచిపోతాడు-'' అని సనత్కుమారులు నారదులకు బోధించారు.

ఈ విషయాన్ని చెబుతూ ఛాందోగ్యం ఈ విధంగా భగవాన్‌ సనత్కుమారులు నారదులకు ఉత్తమ స్థితిని బోధించారు. వారికే స్కందుడనిపేరు' - ''భగవాన్‌ సనత్కుమారస్తగ్‌ం స్కందఇత్యాచక్షతే, తగ్‌ం స్కంద ఇత్యాచక్షతే'' అని రెండుపర్యాయములు ఉద్ఘాటించినది.

అవస్థ అనగా స్థితి, ఛాందోగ్య అవస్థా - జెండావస్థగా మారింది. ఇది పార్సీ వాళ్ళ మత గ్రంథం. పార్సీ మతంలో అగ్నికి ప్రాధాన్య మెక్కువ. సౌరాష్ట్ర దేశం నుంచి వెళ్ళిన ఒకాయన దానిని స్థాపించారు. వారిని సౌరాష్ట్ర అనుటకు బదులు 'జరాతుష్ట్ర' అని వ్యవహరించారు. సౌరమనగా సూర్యసంబంధము కలది. సూర్యుడు, అగ్ని, గాయత్రి - ఈ మూడున్ను శంభుని విశేషరూపములని ''కో బ్రాహ్మణౖరుపాస్యో? గాయత్య్రర్కాగ్ని గోచరః శంభుః అని శంభుని విశేషరూపములని ఆచార్యపాదులు ప్రశ్నోత్తర రత్నమాలికతో విశదీకరించారు. తిరువణ్ణామలైలో అగ్ని స్వరూపముగానే ఈశ్వరుడున్నాడు. శివాగ్నియే సుబ్రహ్మణ్యుడు.

మలయాళదేశంలో దీపములో అమ్మవారిని ఆవాహనమునకు 'భగవతిసేవ' అని ఉపాసిస్తారు. జ్వలిస్తున్న జ్ఞానాగ్నికి ప్రతీకమైన వేలాయుధమును (సుబ్రహ్మణ్యుని చేతనున్న శక్త్యాయుధము) 'శక్తి శక్తి' అని అంటున్నాము.

వేదకర్మలు అగ్నిప్రధానములు. 'అగ్ని' అన్న పదంతోనే వేదం ప్రారంభమౌతుంది. అగ్ని కార్యమే ఔపాసన అనునది. ఉపాసనకు ఆశ్రయమైనది ఔపాసన. ఉపాసన అనగానే అగ్నికార్యమే స్ఫురిస్తుంది. ఔపాసన నాలుగు వర్ణములవారికీ ఉన్నది.

అగ్ని కార్యరూపమైన ఔపాసన, సుబ్రహ్మణ్యుడు అధిదేవత యగుటచేత, వారిని వదలిపెట్టి తక్కిన ఐదుగురినీ, పంచాయతన పూజలో - అనగా గణపతి, సూర్యుడు, మహావిష్ణువు, అంబిక, ఈశ్వరుడు - అనే ఐదుదేవతావిశేషములు - ఆరాధిస్తున్నాము. అందుచేత సుబ్రహ్మణ్యుని ఆరాధనా సంచాయతనపూజా కలసి షణ్మతసాధన ఔతున్నది. కానీ ఈ కాలములో అగ్నికార్యం క్రమంగా లోపించి మూర్తి పూజ జాస్తి ఐనది.

ద్రావిడదేశమున సుబ్రహ్మణ్య సంబంధమైన స్తోత్రములకు పురాణములకు, క్షేత్రములకు వ్యాప్తి ఎక్కువ. ఆయన సకలలోక వశీకరణమూర్తి. పంచాయతన పూజలో మనము సుబ్రహ్మణ్యుని కూడా కలుపుకోవటం ఒక ఉత్తమమైన కార్యము.

ఆచార్యులవారు తిరుచ్చెందూరులో ఉన్న సుబ్రహ్మణ్యమూర్తిని ఉద్దేశించి ఒక ''భుజంగ ప్రయాతస్తోత్రం'' వ్రాశారు. అందులో ఒక శ్లోకంలో భావం ఉంది.

'నేను సముద్రతీరంలో ఉంటూ సంసార సముద్రంలో చిక్కుకొన్న భక్తులను తరింపచేస్తున్నాను. - ఈ సముద్రంలో అలలు ఉత్తుంగముగా లేచి ఎట్లా మరల లయమందుతున్నవో అదేవిధంగా నా భక్తుల ఆపత్తులను, విపత్తులనూ నేను హరిస్తున్నాను' అన్నట్లు సుబ్రహ్మణ్యమూర్తి ఈ తిరుచ్చెందూరులో తిష్ఠవేసి యున్నాడు.' అనే భావం గల శ్లోకములు ఆచార్యపాదులు వ్రాశారు.

యదా సన్నిధానం గతా మానవా మే
భవాంభోధిపారం గతా స్తే తదైవ||
ఇతి వ్యంజయ న్సింధుతీరే య ఆస్తే
త మీడే పవిత్రం పరాశక్తి పుత్రమ్‌ ||


యథాబ్ధే స్తరంగా లయం యాంతి భంగా
స్తధైవాపదః సన్నిధౌ సేవతాం యే ||
ఇతీ వోర్మిపంక్తీ ర్నృణాం దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం ||


'కడలిలో అలలు లేస్తున్నవి. మళ్ళా అందే లయిస్తున్నవి. జగత్తులోని సకల జీవరాసులూ పరమశక్తిమంతుడైన పరాశక్తి పుత్రునియందే జనించి లయించుచున్నవి. అన్న తత్త్వబోధ తిరుచ్చెందూరు స్వామి చేస్తున్నట్లు కనిపించును.

నారదునికి జ్ఞానోపదేశము చేసిన సనత్కుమారులు ఈశ్వరునికి పుత్రుడై పుట్టి ఆయనకే ప్రణవోపదేశం చేశారు. ఈశ్వరాంశలో పుట్టిన ఆచార్యపాదులున్నూ ఈసుబ్రహ్మణ్య భుజంగస్తోత్రంలో - గుహాదేవ మన్వన్నజానే న జానే ' అని పలికి,

అహం చాతి బాలో భవాన్లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ -


అని ప్రార్థిస్తున్నారు.

పరమాత్మ సాక్షాత్కార సిద్ధికై నాలుగు మార్గములున్నవి; జ్ఞానము; భక్తి, యోగము, కర్మ అనునవి. శరీరము, మనస్సు - వీనికన్నిటికీ ఆత్మయే ఆధారము. అట్టి ఆత్మనుగూర్చి మనము చింతన చేస్తూ వచ్చినామంటే తానుగా ఒక ఫ్లాష్‌ (ఎశెఠ) వలె ఆత్మద్యోతన మౌతుంది. జ్ఞాన మనగా ఇదే. ఆ స్థితిలో తెలుసుకొనే జీవాత్మకున్నూ, తెలియబడే పరమాత్మకున్నూ భేదమేలేదు. అదొక శాంత సముద్రమువలె అణగి పోయిన ఆనందస్థితి.

కొందరికి పరమాత్మతో ఇట్లు అభేదంగా ఐక్యం కావటం రుచించదు. కొంచెం వేరుపాటుతో ఉండి భగవంతునితో సరససల్లాపము లాడటంలో వారికి అభిరుచి. ఈ తరగతికి చేరినవారు భక్తి మార్గం అవలంబిస్తారు. భక్తిద్వారా పరమాత్మ అనుగ్రహలాభం వారికి కల్గుతుంది. వీరు చేసే భక్తీ, ఆ భక్తికి ప్రతిఫలంగా స్వామి చూపే కరుణా - ప్రేమ అనే నాణానికి ఉన్న రెండుముఖాలు, ఒకటి జ్ఞానమార్గము. రెండవది ప్రేమ లేక భక్తిమార్గం.

మనస్సను అధిగమించినట్లైతే జ్ఞానము. మనస్సును భక్తితో నింపి దాని సహాయంతో సాక్షాత్కరం పొందటమే భక్తి మార్గం. ఇదే విధంగా శరీరంతో కర్మలను చేయవలెను. ఈ కర్మలను మనకోసంకాక ఈశ్వరార్పణ బుద్ధితో నిస్సంగత్వంతో చేస్తే దానిని కర్మమార్గమని అంటారు. దానిలో ఒక ఆనందం ఉంది.

మనస్సును నిలుపుటకు శక్తి లేనిదానివలన మనము ఆత్మను ఎరుగలేకున్నాము. మనస్సు ఒక్క క్షణమైననూ నిలువక ఎపుడూ భ్రమిస్తూనే వుంటుంది. కానీ మనము శ్వాసను నిలిపినామంటే, శ్వాస నిలిపినంతసేపూచ మనస్సూ నిలుస్తుంది. మనలో ప్రాణ మొకటి ఉన్నది. ఈ ప్రాణమును కొన్ని విధానములలో మనము నియమన మొనర్చిన, ప్రాణాధారమైన పరమాత్మ శక్తి స్వాధీన మగును. ఈ విధానమునకు యోగ మార్గమని పేరు.

ప్రాణశక్తి శరీరములో మూలాధార మనెడుచోట, సర్పరూపములో నున్నది. మనకు దాని మహాశక్తి తెలియదు. అది సుప్తపన్నగము. దానిని తట్టి లేపుటకే యోగసాధనలన్నీ. సుబ్రహ్మణ్యుడు యోగస్వరూపి. ఆయనను సర్పాకారములో పూజించుటమూ కద్దు. ముత్తుస్వామి దీక్షితులు 'వాసుకి తక్షకాది సర్పస్వరూప ధారణాయ' అని శ్రీ సుబ్రహ్మణ్యాయ నమస్తే' అను కృతిలో వారిని సంబోధిస్తారు. నాగప్రతిష్ఠ, షష్ఠీవ్రతం ఇవన్నీ సర్పస్వరూపంలో మనం సుబ్రహ్మణ్యుని ఉద్దేశించి చేసే ఆరాధనలే.

పరమేశ్వరుడు ఒక పచ్చని చెట్టువలె ఉన్నడనుకొందాం. అప్పుడు అంబిక ఆయనకు పరివేష్టించిన పచ్చని లతవలె వుంటుంది. అట్లాకాక పరమేశ్వరుడు స్థాణువువలె ఎండిన వృక్షమువలె వున్నాడనుకొందాం. అప్పుడు అంబికయూ ఎండిన తీగవలె, అపర్ణయై ఆయనకు పరివేష్టించియే వుంటుంది. అమ్మవారికి అపర్ణ అనునదొకపేరు. పార్వతిగా ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి పతిగావరించి, భర్తృలాభం కోసం ఆమె తపస్సు చేసినపుడు ఆకులను కూడా ఆమె ఆహారముగా స్వీకరించని కారణంగా ఆమెకు అపర్ణ అనుపేరు సిద్ధించిందని కొందరంటారు. నావరకు నాకు, స్థాణువును పరివేష్టించి అపర్ణయై (ఆకులు లేక) ఉన్న లతావిశేషమే అంబిక అని తోస్తుంది. ఈశ్వరుడు అంబిక ఉన్నచోట సోమాస్కందుల వలె సుబ్రహ్మణ్యుడు కూడ వారిమధ్య ఉండవలెను కదా!

ఈశ్వరుడు స్థాణువుగనూ, అంబిక అపర్ణగానూ వున్నప్పుడు స్కందుడు ఎలా వున్నాడు! ఆయన 'విశాఖ' రూపంలో ఉన్నాడని నాకు తోస్తుంది. శాఖ అనగా కొమ్మ వేదములలో పలుశాఖలున్నవి. ఒక పదమునకు 'వి' అను అక్షరము చేర్చినపుడు వివిధములైన అర్థములు వచ్చును. జయమనుపదమున్నది. విజయమనగా విశేషమైన జయమని అర్థము. 'వి' అను అక్షరమును వ్యతిరేకార్థము కూడ ఉన్నది. ధవ అనగా భర్త కలది. విధవ అనగా భర్తలేనిది. ఈ అర్థములో విశాఖ అనగా శాఖలులేనివాడు అని అర్థము. ఈశ్వరుడు స్థాణువుగనూ, అంబిక అపర్ణగానూ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యుడు విశాఖుడై - శాఖలు లేని చిన్న మొలకవలె ఉన్నాడు. అది పరమ వైరాగ్యమైన స్థితి. అందులకే సుబ్రహ్మణ్యుడు జ్ఞానిగానూ, భిక్షకుడు గానూ, వ్యుప్తకేశుడుగనూ దండాయుధ పాణిగాను దర్శనమిస్తున్నాడు. వారే వల్లీ దేవసేనా సమేత కల్యాణసుబ్రహ్మణ్య స్వామిగానూ విలసిల్లుతున్నారు.

పామరులనుండి దేవతల వఱకూ, అనుగ్రహం చేసే దేవతామూర్తి ఆయనే. ఆటవిక స్త్రీ అయిన వల్లీ ఆయనకు ఒక భార్య. దేవరాజైన ఇంద్రుని కుమరై దేవసేన మరొక భార్య ఆయన దేవసేనలకు కూడ పతి.

మద్రాసులో తేనాంపేట అని ఒక చోటున్నది. అక్కడ సుబ్రహ్మణ్యుని ఆలయంలో కుంభాభిషేకం జరిగినపుడు - ఈ తేనాంపేట, దేవనాయకన్‌ పేట అనే పేరుకు అపభ్రంశమేమో అన్న యోచన నాకు కలిగింది.

సుబ్రహ్మణ్యుని లీలావిలాసాలను ఇంతవరకూ వర్ణించాము. అటువంటి సుబ్రహ్మణ్యశ్వరుని మనమందరమూ భక్తితో కొలచిన ఇహపరములకు లోటుండదు. తులామాసంలో చేసే షష్టీవ్రతం విశేషం. తులామాసంలో వచ్చే ఈ షష్టీ వారి సమత్వానికి - (తుల - త్రాసు) చిహ్నం. వారు ఎప్పుడూ జ్ఞాననిష్ఠలో ఉన్నప్పటికీ లోకానుగ్రహార్థం అసురసంహారం చేసి భక్తులను రక్షించుట వారికి పరిపాటి. బహిశ్శత్రువులతో బాటు అంతఃశ్శత్రువులనూ పరిమార్చి మనలను జ్ఞానులుగా మార్చే జ్ఞానశిఖరజ్యోతి ఆయన. హృదయమనే దీపంలో భక్తి అనే వత్తిని వేసి, అనురాగమనే ఘృతముతో నింపి వెలిగిస్తే ఆయన అనుగ్రహం మనపై ప్రసరించి ఆ జ్ఞానజ్యోతిలో మనంకూడ ఐక్యం కాగలం.

జయానందభూమ జయాపారధామన్‌
జయామోఘకీర్తే జయానందమూర్తే|
జయానందసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తి దానేశ సూనో||

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/12/blog-post_29.html

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.