Tuesday 13 December 2016

ఏది ధర్మము ?


ఏది ధర్మము ?
బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారి ఉపన్యాసముల నుండి.
@శంకరవాణి,  #వేదధర్మశాస్త్రపరిపాలనసభ

వెనుక తెనాలిలో బండ్లమూడి గురునాధశాస్త్రులు వారని ఒక పండితుడు ఉండెడివాడు. ఆయన వద్దకు పలువురు ధర్మసందేహాలకు సమాధానాలకై జిజ్ఞాసతో వచ్చి పోవుచుండెడివారు. ఆ ధార్మికుడు విసుగు విరామము లేక వారికి సప్రమాణముగా గ్రంథములోని పంక్తిని చూపించి ధర్మము చెప్పుచుండెడివారు. ఆయన అందరికీ తెలిసిన ధర్మమే అయిననూ ధర్మసింధువు అను గ్రంధమును తెచ్చి దానిలో వెదికి "నాయనా! ఇదిగో ఈ పంక్తి ఇలా ఉన్నది. ఈ ధర్మము ఇలా ఉన్నది" అని చూపి చెప్పెడివారు. అట్టిచో నేను ఒకపరి వారి వద్దకు వెళ్ళితిని. ఆ శాస్త్రులవారిని "ఇది అందరికీ తెలిసిన ధర్మమే కదా ఈ సమాధానం నాకునూ తోచుచునే యున్నది దీని కొరకై మీరు పుస్తకము తెచ్చి చూపించవలసిన అవసరమేమున్నది?" అని అడిగితిని. ఆ మహాత్ముడు "నాయనా! ధర్మం చెప్పుటకు మనమెవ్వరము? మనం చెప్పునది ధర్మమగునా! చదివినది సరిగా జ్ఞాపకం ఉన్నదో లేదో,  జ్ఞాపకం ఉన్ననూ చెప్పుటలో పొరబాటు వచ్చునేమో కాన ధర్మనిర్ణయం ప్రాచీన గ్రంధములను జూపియే చెప్పవలెను. అట్టి ఆధారం దొరకనప్పుడు పెద్దలను విచారింపుమని చెప్పవలెను. ధర్మ శబ్దార్థము ఎవరికి తెలియదు? దొంగలు ధనము పంచుకొనుటలో కూడా హెచ్చుతగ్గులు వచ్చినపుడు ధర్మము చెప్పమందురు. బ్రహ్మతత్త్వము వలె ధర్మతత్త్వము లోకమంతటా నిండియున్నది. అందరికీ తెలియుచునే యున్నది కాని తెలియదు. కనుక ధర్మం తప్పుగా గాని ఒప్పుగా గాని చెప్పితిమన్న నేరం మనకెందులకు? గ్రంథకర్త వాక్యాలను చూపించినచో ఆయన శ్రమపడి ధర్మమును విచారించి త్రికాలాబాధ్యముగా వ్రాసియుండును గాన మనమీద దోషము ఉండదు, నీ బోటి బాలురు తెలిసికొనవలసిన విషయమిదియని" ఆ మహాత్ముడు నా చిన్నతనములో చెప్పెను. ఇప్పటికినీ ఆ ధర్మము నా మనసునకు కొత్తగానే తోచుచుండును. ఇప్పటివారు చెప్పు ధర్మము వారి మదికి తోచినది, వారు వేదశాస్త్రములు, గురుశుశ్రూష చేసి గ్రహించినది కాదు.

http://jagadguru-vaibhavam.blogspot.in/2016/12/blog-post_13.html
 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.